నెల్లూరుకు చెందిన యువ ఐపీఎస్‌ విజయగాథ

Trainee IPS Prathap Sivakishore Success Story - Sakshi

ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్‌ 

ఇదీ ట్రైనీ ఐపీఎస్‌ కొమ్మి ప్రతాప్‌ శివకిశోర్‌ విజయగాథ 

చిన్నతనంలోనే  పెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఎలాగైనా సాధించాలని పట్టుదలతో శ్రమించారు. తొలి రెండు ప్రయత్నాల్లో దక్కకున్నా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో ప్రిపేర్‌ అయి తన ఆశయమైన ఐపీఎస్‌ సాధించారు కొమ్మిప్రతాప్‌ శివకిశోర్‌. శిక్షణలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఈ యువ ఐపీఎస్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం

సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కొమ్మి నారాయణ, నిర్మలకు ఉదయ్‌ ప్రశాంతి, కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ సంతానం. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా తల్లి  గృహిణి. వీరు కుమారుడు కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌కు ఐపీఎస్‌పై ఆసక్తి ఉందని తెలుసుకుని చిన్నప్పటి నుంచి చదువులో ప్రోత్సహించారు.

శిక్షణలో భాగంగా కొండల్లో తిరుగుతున్న కొమ్మి ప్రతాప్‌ శివకిశోర్‌   

కసితో చదివి..
ట్రైనీ ఐపీఎస్‌ కొమ్మి ప్రతాప్‌ శివకిశోర్‌ 1 నుంచి 8 వరకు నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చంచులూరు జెడ్పీ పాఠశాలలో చదివారు. 9, 10 జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదవగా, ఇంటర్మీడియెట్‌ నారాయణ కాలేజీలో పూర్తి చేశారు. 2015లో ఖరగ్‌పూర్‌ ఐఐటీలో చేరి ఇంజినీరింగ్‌ చదివారు.  తర్వాత బెంగళూరులోని బాసే సెంట్రల్‌ ఆర్ట్‌మీ ఇంటెలిజెన్సీలో సీనియర్‌ డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరి సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. 2016, 2017 సంవత్సరాల్లో రెండు సార్లు సివిల్స్‌ పరీక్షలు రాశారు. మంచి ర్యాంక్‌ రాకపోవడంతో 2018లో మరింత కసితో ప్రిపేర్‌ అయి అనుకున్న లక్ష్యాన్ని సాధించి హైదరాబాద్‌ సమీపంలోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌  అకాడెమీలో శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.  

పిల్లల ఆసక్తిని గమనించాలి 
ప్రతి పిల్లవాడికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. దానిని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.  ఇక ఎమ్మిగనూరు ప్రజలకు పోలీసులపై ఒక రకమైన అభిప్రాయం ఉంది. వారిలో తెలియని ఆ భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. స్టేషన్‌కు వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top