
అల్లూరి సీతారామరాజు: జిల్లాలో సంచలనం సృష్టించిన బావమరుదుల హత్య కేసులో బావను సీలేరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను జీకే విధి సీఐ వరప్రసాద్, సీలేరు ఎస్‌ఐ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. నిందితుడు వంతల గెన్ను సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో ఆదివారం జరిగిన బంధువు దినకర్మకు బావమరుదులు కిముడు కృష్ణ, కిముడు రాజు హాజరయ్యారు. అనంతరం ఆదివారం రాత్రి నిందితుడి ఇంట్లోనే వారంతా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో గెన్ను తన తరచూ వేధిస్తున్న విషయాన్ని అన్నదమ్ములకు సోదరి(గెన్ను భార్య) చెప్పింది. దీంతో బావమరుదులు గెన్నును నిలదీశారు.
అర్ధరాత్రి ఒంటి గంట వరకు గొడవ కొనసాగింది. ఆగ్రహించిన గెన్ను.. ఇంట్లో ఉన్న బల్లెంతో ముందుగా మూడో బావమరిది కిముడు రాజును పొడిచాడు. ఆయన తప్పించుకుని పారిపోయాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, పిల్లలు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మరో బావమరిది కిముడు రాజు అడ్డుకున్నాడు. అతనిని కూడా బల్లెంతో కడుపులో పొడవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇంటి బయట కారులో నిద్రిస్తున్న కిముడు కృష్ణ చూసి ఇంట్లోకి పరిగెత్తి వెళ్లగా నిందితుడు దాడి చేసి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై 2013లో కూడా ఓ హత్య కేసు ఉందన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించామని తెలిపారు.
వేదన మిగిల్చిన హత్యలు
సీలేరు మేజర్ పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల హత్యలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా.. మరో సోదరుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అన్నదమ్ముల అంత్యక్రియలకు కూడా తమ్ముడు రాలేని దీన పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం పోస్టుమార్టం నిమిత్తం సీలేరు నుంచి చింతపల్లికి మృతదేహాలను తరలించారు.
మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పినట్టు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాలకు స్వగ్రామమైన ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.