కడుపు మండిన మామిడి రైతులు | Totapuri mango farmers fires on Coalition govt | Sakshi
Sakshi News home page

కడుపు మండిన మామిడి రైతులు

Jun 17 2025 5:47 AM | Updated on Jun 17 2025 5:47 AM

Totapuri mango farmers fires on Coalition govt

గంగసాగర్‌ ఫ్యాక్టరీ వద్ద రైతులు

గుజ్జు ఫ్యాక్టరీల వద్ద టోకెన్ల కోసం క్యూకట్టినా దక్కని ఫలితం 

మామిడి కొనలేమంటూ చేతులెత్తేసిన కంపెనీలు 

నిరసనలకు దిగిన కర్షకులు

కాణిపాకం: కడుపు మండిన తోతాపురి మామిడి రైతులు సోమవారం కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనలేమంటూ కంపెనీలు చేతులెత్తేయడంతో చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారులపై నిరసన తెలిపారు. చిత్తూరు, జీడీనెల్లూరు, బంగారుపాళ్యం, తవణంపల్లి మండలాల్లోనూ రైతులు ఆందోళనలు చేశారు. చిత్తూరు గంగసాగరం ఫ్యాక్టరీలో మామిడి కొనుగోలుకు టోకెన్లు జారీ చేస్తున్నారని ప్రకటించడంతో మామిడి రైతులు ఆదివారం అర్థరాత్రి నుంచే అక్కడ పడిగాపులు పడ్డారు.

సోమవారం ఉదయం 5 గంటల సమయానికి వందలాది రైతులు టోకెన్ల కోసం గుమిగూడారు. టోకెన్లు పంపిణీ చేయకపోగా గేట్లు మూసివేయడంతో రైతులు కర్మాగారాన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఇద్దరు మహిళా రైతులు  స్పృహతప్పేలా ఉండడంతో రైతులంతా హాహాకారాలు చేశారు. దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది మహిళా రైతులను లోపలకు అనుమతించారు. పోలీసులు రైతులను అదుపు చేసే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అరకొరగా టోకెన్లు పంపిణీ చేసి మళ్లీ వచ్చేనెల 5న ఇస్తామంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం బోర్డు పెట్టింది. దీంతో రైతులు ఉసూరు మన్నారు.

గంగాధర నెల్లూరు మండలంలోని ఫ్యాక్టరీ వద్ద కూడా టోకెన్లు ఇస్తారంటూ ప్రచారం చేయడంతో రెండు, మూడు రోజులుగా రైతులు మామిడి కాయలతో పడిగాపులు పడ్డారు. సోమవారం ఉదయానికీ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. బంగారుపాళ్యం మండలంలోనూ ఫ్యాక్టరీ టోకెన్లు ఇవ్వలేదని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై రైతులు నిరసనకు దిగారు.  తవణంపల్లి మండలంలోనూ ఫ్యాక్టరీ నిర్వాహకులు మామిడి కొనలేమని బోర్డు పెట్టేసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించినట్టు రూ.8కి మామిడి కాయలు కొనలేమని, రూ.5కూ కష్టమేనని ఫ్యాక్టరీలు చేతులెత్తేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement