
కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న పొగాకు రైతులు
పంటలను కొనుగోలు చేయలేని ప్రభుత్వం మాకు వద్దు
కూటమి ప్రభుత్వంపై పొగాకు రైతులు ఆగ్రహం
కర్నూలులో రోడ్డెక్కి.. ఆందోళన కలెక్టరేట్
ఎదుట పొగాకు బేళ్లతో నిరసన
పీసీపల్లి/ కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన పొగాకు రైతులు రోడ్డెక్కారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఏపీ రైతు సంఘంతో కలిసి పొగాకు బేళ్లను రోడ్డుపై వేసి ధర్నా చేశారు. రైతులపై ఎందుకింత కక్ష అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంటలను.. కనీసం కొనుగోలు చేయలేని ప్రభుత్వం తమకు వద్దంటూ నినదించారు. సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు కొనుగోలు చేశామని చెప్పడం దారుణమన్నారు.
వారు చెబుతున్నట్లుగా కంపెనీలు గానీ, ప్రభుత్వం గానీ కర్నూలు జిల్లాలో ఒక్క ఆకును కూడా కొనలేదని ఏపీ రైతుసంఘం రాష్ట్రకార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదన్నారు.
బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకేస్తాం
‘లోగ్రేడ్ పొగాకు కొంటేనే వేలంలో పాల్గొంటాం. లేదంటే పొగాకు బేళ్లకు నిప్పంటించి.. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటాం’ అని పొగాకు రైతులు బోర్డు అధికారులకు తెగేసి చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి పొగాకు బోర్డు పరిధిలోని పెద్ద అలవలపాడు క్లస్టర్ రైతులు లోగ్రేడ్ పొగాకును బయ్యర్లు కొనడం లేదంటూ రెండు రోజుల నుంచి పొగాకు లోగ్రేడ్ పొగాకు కొంటేనే వేలం జరుగుతుందని.. లేదంటే పొగాకుకు నిప్పుపెట్టి.. ఆ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు తెగేసి చెప్పారు.