టోల్‌ప్లాజా వద్ద చింతమనేని టిప్పర్‌ డ్రైవర్ల వీరంగం | Tipper lorry drivers belonging to Chintamaneni Prabhakar clash with staff over non payment of toll fees | Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజా వద్ద చింతమనేని టిప్పర్‌ డ్రైవర్ల వీరంగం

Oct 5 2026 3:29 AM | Updated on Oct 5 2026 3:29 AM

Tipper lorry drivers belonging to Chintamaneni Prabhakar clash with staff over non payment of toll fees

టోల్‌ఫీజు కట్టకుండా హైడ్రామా

6 టోల్‌ బూత్‌ల వద్ద లారీలను నిలిపేసిన డ్రైవర్లు

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్‌లు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు శివారు వెస్ట్‌ బైపాస్‌ టోల్‌ప్లాజా వద్ద దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందిన టిప్పర్‌ లారీ డ్రైవర్లు ఆదివారం వీరంగం సృష్టించారు. ఏలూరు నుంచి కొండపల్లి వైపు టిప్పర్లతో వెళ్తున్న డ్రైవర్లు టోల్‌ ఫీజు కట్టకుండా సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన టిప్పర్లకు టోల్‌ఫీజు ఎందు­కు కట్టాలంటూ సిబ్బందిపై చిందులు తొక్కు­తూ రెచ్చిపోయారు. కొన్ని వాహనాలు ఫీజు చెల్లించకుండానే టోల్‌గేట్‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాయి. మిగిలిన వాహనాలను సిబ్బంది అడ్డుకున్నారు. 

ఈ ఘటనతో వెస్ట్‌ బైపాస్‌పై కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెట్‌మిక్స్‌ కోసం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి చెందిన 18 టిప్పర్లు దెందులూరు నుంచి దొనబండకు బయలుదేరాయి. ఉదయం 10 గంటలకు వెస్ట్‌ బైపాస్‌లోని టోల్‌ప్లాజా వద్దకు రాగానే టోల్‌ఫీజు కోసం సిబ్బంది లారీలను ఆపారు. చింతమనేనికి చెందిన వాహనాలకు టోల్‌ఫీజు కట్టాల్సిన పనిలేదని డ్రైవర్లు అక్కడి సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో డ్రైవర్లకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

టోల్‌ ఫీజు కట్టకుండా పంపించబోమని సిబ్బంది తేల్చిచెప్పడంతో మధ్యాహ్నం నుంచి డ్రైవర్లు టిప్పర్లను టోల్‌గేట్‌కు అడ్డంగా పెట్టి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో సుమా­రు 4 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ నిలిచి­పోయింది. నాలుగు అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోవడంతో సిబ్బంది స్పందించి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పంపించారు. చివరికి.. టోల్‌ప్లాజా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రశాంతి సిబ్బందితో అక్కడికి చేరుకుని అడ్డుగా పెట్టిన టిప్పర్లను పక్కకు తీయాలని హెచ్చరించినా డ్రైవర్లు లెక్కచేయలేదు. 

అంతేకాకుండా పది టిప్పర్‌ లారీలు టోల్‌గేట్‌ను ఢీకొట్టుకుంటూ గొల్లపూడి వైపు వేగంగా వెళ్లిపోయాయి. మరో 8 టిప్పర్లను పోలీసులు అడ్డుకుని పక్కన పెట్టించారు. కొద్దిసేపటికి సీఐ బీవీ శివప్రసాద్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఒక టిప్ప­ర్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహ­నం రికార్డులు చూపించాలని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు లారీ దిగమని చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిపో­యే ప్రయత్నం చేసిన డ్రైవర్‌పై సీఐ ఆగ్రహం వ్యక్తం­చేసి అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement