అదనపు న్యాయమూర్తులుగా ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్, గంధం సునీతతో ప్రమాణం చేయిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్
సునీత, గిరిధర్, పురుషోత్తంతో ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ లీసా గిల్
సీనియర్ న్యాయమూర్తులతో కలిసి కేసుల విచారణ
హైకోర్టులో 32కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ సోమవారం ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించారు. మొదట హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ముగ్గురు అదనపు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం వారి ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తరువాత జస్టిస్ రవినాథ్ తిల్హరీతో కలిసి పురుషోత్తం కుమార్, జస్టిస్ బట్టు దేవానంద్‌తో కలిసి గంధం సునీత, జస్టిస్ దొనడి రమేష్‌తో కలిసి ఆలపాటి గిరిధర్ కేసులను విచారించారు.
హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను.. ప్రస్తుతం 29 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతోపాటు రిజిస్ట్రార్లు, అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారి కుటుంబ సభ్యులతోపాటు అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, న్యాయవాదులు పాల్గొన్నారు. అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన ముగ్గురిని పలువురు న్యాయవాదులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


