
ఘటనను ప్రసారం చేయొద్దంటూ మీడియాను బెదిరిస్తున్న సోమిరెడ్డి
నెల్లూరు డీడీఆర్‌సీ మీటింగ్‌లో ఉద్రిక్తత
రామాయపట్నంలో 20 వేల ఎకరాల సేకరణపై ఎమ్మెల్సీ విమర్శ
కరేడు భూసేకరణపై చర్చించాలని పట్టు
తూమాటి ప్రసంగంపై కందుకూరు, ఉదయగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేల రగడ
డీఆర్సీ సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయిన ఎమ్మెల్సీ తూమాటి
నెల్లూరు (పొగతోట): రామాయపట్నం పోర్టు పరిధిలో కూటమి ప్రభుత్వం బలవంతంగా చేపడుతున్న భూ సేకరణపై జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ(డీడీఆర్‌సీ) సమావేశంలో నిలదీసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ వేలు చూపిస్తూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక దశలో దాడి చేసే యత్నం చేశారు. ఈ ఘటన ముగ్గురు మంత్రులు మహ్మద్ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలోనే బుధవారం ఈ ఘటన జరిగింది.
భూసేకరణపై వివరణ ఇవ్వండి: ఎమ్మెల్సీ తూమాటి
వ్యవసాయశాఖపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ మాధవరావు భూ సేకరణపై చర్చకు పట్టుబట్టారు. జూలై 13న రామాయపట్నం పోర్టుకు 20 వేల ఎకరాల భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామంటూ ప్రభుత్వం జీఓ ఇచి్చందని, 20 వేలు ఎకరాలు ఏ ప్రాంతంలో సేకరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కరేడులో భూ సేకరణను ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. 5 వేల ఎకరాలు సరిపడే పరిశ్రమకు 8,300 ఎకరాలకు పైగా సేకరిస్తున్నారని, దీనివల్ల 5 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు.
వాగ్వాదానికి దిగిన కందుకూరు ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ తూమాటి మాట్లాడుతుంటే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సభా మర్యాదను పాటించకుండానే వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇచి్చన జీఓకు వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దగమాటి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీపైకి దూసుకువచ్చారు. సభావేదికపై ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ఎమ్మెల్సీని తప్పుబట్టారు.
మంత్రి ఆనం మాట్లాడుతూ ‘‘ఇది అసెంబ్లీ కాదు. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చించండి. నీ రాజకీయ అనుభవం నాలుగేళ్లు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. మాట్లాడకుండా కూర్చోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్సీ తూమాటి వాకౌట్ చేసి బయటకు వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ఒక పరిశ్రమ పేరు చెప్పి బీపీసీఎల్‌కు భూములు కేటాయించేందుకు యత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ విషయంపై ప్రశ్నించినందుకు తనను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాగళం వినిపిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనను ప్రసారం చేయొద్దంటూ మీడియాను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బెదిరించారు.