పోటీ లేకుండా 131 ఈవీ చార్జింగ్ స్టేషన్ల కాంట్రాక్టును కట్టబెట్టేలా ఎత్తుగడ?
రూ.62.94 కోట్ల భారీ ప్రాజెక్టును ఏకపక్షంగా అప్పగించేలా నిబంధనలు
ఇప్పటికే 8వేల కిలోవాట్ల ఈవీ చార్జింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసి ఉండాలని షరతు
65 ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండాలని మెలిక
ఇలాంటి నిబంధనల వల్ల చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు ఆదిలోనే చెక్
131 ఈవీ కేంద్రాలకూ ఒకే టెండర్ వేయాలనడంపై అనుమానాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో కొందరు పెద్దలు మరోసారి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. విద్యుత్ శాఖలో తమకు నచ్చినవారికి రూ.62.94 కోట్ల విలువైన పనులను ఏకపక్షంగా కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలను రూపొందించేలా చక్రం తిప్పారు. నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ–నెడ్‌క్యాప్) విద్యుత్ వాహనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 131 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20,832 కిలోవాట్ల సామర్థ్యంతో ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని టెండర్ పిలిచింది. అయితే, టెండర్‌లోని అర్హత నిబంధనలు మాత్రం అతి కొద్దిమందికే అవకాశం కల్పించేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నిటికీ ఒక్కటే టెండర్...
రూ.62.94 కోట్ల ఈ భారీ ప్రాజెక్టును పోటీ లేకుండా ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారికి కట్టబెట్టేలా నిబంధనలు తయారు చేశారు. నెడ్‌క్యాప్ అధికారులు చెప్పినదాని ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 131 ప్రాంతాలకు ఒకే బిడ్ సమరి్పంచాల్సి ఉంటుంది. అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం ప్రాజెక్టును ఒకే సంస్థ లేదా ఒకే కన్సార్షియం నిర్వహించాలి. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులను జోన్‌లుగా లేదా జిల్లాల వారీగా విభజించి టెండర్లు పిలవడం ద్వారా ఎక్కువ కంపెనీలకు అవకాశం కల్పిస్తారు.
కానీ ఈ టెండర్‌లో అలాంటి అవకాశం లేదు. ఇది పోటీని పరిమితం చేసేలా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, మధ్య తరహా కంపెనీలు, కొత్తగా ఈవీ రంగంలోకి వచ్చిన స్టార్టప్‌లకు కనీసం టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం కూడా లేకుండా చేశారు. సాధారణంగా విద్యుత్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టుల్లో పనులను ప్యాకేజీలుగా విభజించడం ద్వారా ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రాజెక్టులో అలాంటి విధానం ఎందుకు అనుసరించలేదన్నది చర్చనీయాంశంగా మారింది.
బడా సంస్థల కోసమే ఈ నిబంధనలు?
టెండర్ నిబంధనల ప్రకారం బిడ్డర్ గత ఐదేళ్లలో కనీసం 8 వేల కిలోవాట్ల ఈవీ చార్జింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసి ఉండాలి. 65 వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండాలి. కనీసం 170 చార్జర్ల నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. రూ.31 కోట్ల సగటు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి. రూ.12 కోట్ల నికర ఆస్తులు ఉండాలి. ఈ నిబంధనలను చూస్తే ప్రభుత్వ పెద్దలు ఎవరికి టెండర్ ఇవ్వదలిచారో వారికి మాత్రమే ఉంటాయని, మిగతా సంస్థలు పోటీకి అర్హత సాధించలేవని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నికల్ మూల్యాంకనంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ చార్జర్ తయారీ యూనిట్ ఉన్న కంపెనీలకు 15 మార్కులు కేటాయించారు.
స్థానిక తయారీని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని పైకి చెబుతున్నప్పటికీ, అసలు ఉద్దేశం వేరే ఉన్నట్లు కనిపిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రంలో తయారీ యూనిట్లు ఉండకపోవచ్చు. వారు ఒక రాష్ట్రంలో తయారీ యూనిట్లు పెట్టి తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండవచ్చు. అలాంటి సంస్థలు పోటీలో లేకుండా ఈ నిబంధన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలతోపాటు పలు భారీ సంస్థలు కూడా టెండర్లు వేయలేవు. అంతిమంగా తాము ముందుగా నిర్ణయించుకున్న సంస్థకే ఈ భారీ టెండర్‌ను కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.


