
పాలమూరు రంగారెడ్డి తొలిదశ చేపట్టడానికి వీలుగా సీడబ్ల్యూసీకి తెలంగాణ సర్కార్ డీపీఆర్
దీనిద్వారా శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువ నుంచే ఎడాపెడా 45 టీఎంసీలను తరలించేందుకు తెలంగాణ ఎత్తుగడ
అయినా కిమ్మనని చంద్రబాబు సర్కార్
ఇప్పటికే శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 అడుగుల కంటే దిగువస్థాయి నుంచి రోజుకు 4 టీఎంసీలను తరలిస్తున్న తెలంగాణ
2015లో సీఎంగా ఉన్నపుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కళ్లముందు ఉల్లంఘించి కడుతున్న నోరుమెదపని బాబు
రాయలసీమ, నెల్లూరు సాగు, తాగునీటి కోసం రాయలసీమ ఎత్తిపోతుల చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
ఎత్తిపోతల పనులు ఆపేసి మరోసారి రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు
గతంలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను తాకట్టు పెట్టిన వైనం..
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాయలసీమ, నెల్లూరు హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యానికి మరో నిదర్శనమిది. చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి తరలించడానికి వీలుగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం)కి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సమర్పించింది.
నిజానికి కృష్ణా బేసిన్‌లో చిన్న నీటిపారుదల విభాగం కింద తెలంగాణకు కేటాయించిన నీటి కంటే అధికంగా వాడుకుంటోందని సాగు నీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల కంటే దిగువ నుంచే ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఇప్పటికే 4 టీఎంసీలు తరలిస్తూ.. జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ, నెల్లూరు హక్కులను తెలంగాణ హరిస్తోంది.
పాలమూరు– రంగారెడ్డి తొలి దశకు సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే శ్రీశైలం నుంచి 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచే రోజుకు మరో 0.75 టీఎంసీలను.. మొత్తంగా 4.75 టీఎంసీలు తరలించే హక్కు తెలంగాణకు వస్తుంది. ఇది రాయలసీమ హక్కులకు మరింత విఘాతం కలిగిస్తుందని సాగునీటిరంగ నిపుణులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇవేమీ పట్టనట్లు చంద్రబాబు ప్రభుత్వం నోరుమెదపకపోవడం గమనార్హం.
నాడు ఓటుకు కోట్లు కేసుతో హక్కులు తాకట్టు..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో గరిష్టంగా 120 టీఎంసీలు తరలించేలా 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల చేపట్టింది. ఈ ఎత్తిపోతల వల్ల రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అటు రైతులు.. ఇటు నీటిపారుదలరంగ నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.
ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నాటి సీఎం చంద్రబాబు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై నోరుమెదపలేదు. దాంతో 2019 నాటికి ఆ ప్రాజెక్టు పనులను సింహభాగం తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది.
నేడు చంద్రబాబు సర్కార్ మళ్లీ అదే తీరు..
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. చిన్న నీటిపారుదల విభాగం కింద తమకు కేటాయించిన నీటిలో 45.6 టీఎంసీలు మిగులు ఉందని, ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశ ద్వారా తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ తాజాగా సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించింది. కానీ, ఆ రాష్ట్రం చిన్న నీటిపారుదల విభాగం కింద అధికంగా నీటిని వాడుకుంటోంది.
అయినా సరే చంద్రబాబు సర్కార్ నోరుమెదపకుండా రాయలసీమ, నెల్లూరు హక్కులకు మళ్లీ విఘాతం కలిగిస్తోంది. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్‌సీపీ సర్కార్ నిర్ణయించింది.
చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్‌లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది.
పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థంగా వాదనలు విన్పించకపోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది.
సీమ హక్కులు పరిరక్షించిన వైఎస్సార్‌సీపీ సర్కార్..
కృష్ణా జలాల్లో చిన్న నీటిపారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు ఉందని, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తమకే దక్కుతాయని తనకు తానే తెలంగాణ సర్కార్ తీర్మానించుకుంది. ఆ రెండూ కలిపి 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను పంపింది. ఆ డీపీఆర్‌ను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పంపి అభిప్రాయాన్ని కోరింది.
చిన్న నీటిపారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు లేదని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది ట్రిబ్యునల్ తేల్చాలని సీడబ్ల్యూసీకి 2022 సెప్టెంబరు 19న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నివేదించింది. నీటి లభ్యతే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, తద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి వెనక్కి పంపింది.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణలో ఉన్న అంశంపై తాము జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కు దక్కిన నీటిని వాడుకోవడానికి తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం.
ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్ష్య తో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.