
వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ విమర్శ
సాక్షి, అమరావతి: టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ విమర్శించింది. ఇప్పటి వరకూ జరిగిన ఏ కేబినెట్ సమావేశంలోనూ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలపై చర్చించలేదని పేర్కొంది. తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలోనైనా బకాయిలు, డీఏలు, ఆరి్థక ప్రయోజనాలు, 12వ పీఆర్సీ, ఐఆర్ పైనా ప్రభుత్వం ప్రస్తావిస్తుందనుకున్నా నిరాశే మిగిలిందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్ కుమార్ రెడ్డి, గెడ్డం సుధీర్ విమర్శించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని, బకాయిలన్నీ విడుదల చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచి్చన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం మానేసిందని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు జరిగి మూడు నెలలు కావొస్తున్నా, కొత్త పాఠశాలల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు సత్వరం పరిష్కరించకపోతే ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.
‘విద్యాశక్తి’ని వాయిదా వేయాలి
కాగా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘విద్యాశక్తి’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ వి.రెడ్డి శేఖర్ రెడ్డి మరో ప్రకటనలో డిమాండ్ చేశారు. పాఠశాల పనివేళలు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనడం అధికారుల అనాలోచిత నిర్ణయమని, ఇది ఉపాధ్యాయులపై పనిభారాన్ని పెంచడమేనని విమర్శించారు.