
నాకేం తక్కువ.. గవర్నర్ గిరీ ఎందుకివ్వరు!?
అశోక్ గజపతిరాజుకు ఇవ్వడంపై అసహనం
తీవ్ర అసంతృప్తితో టీడీపీ సీనియర్ నేత
వెన్నుపోటు ఎపిసోడ్‌లో నేను లేకపోతే చంద్రబాబు ఎక్కడ?
అయినా అవమానకరంగా రాజకీయాల నుంచి నిష్క్రమించేలా చేశారు
కనీసం రాజ్యసభ అవకాశం కూడా ఇవ్వలేదు
సన్నిహితుల వద్ద యనమల తీవ్ర ఆవేదన
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమకాలీకుడైన యనమల రామకృష్ణుడు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలతో రగిలిపోతున్నారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ తనపట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఏమాత్రం జీర్జించుకోలేకపోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకి గవర్నర్ పదవి రావడంతో యనమలలో అసంతృప్తి తారస్థాయికి చేరింది.
తనకి కాకుండా అశోక్‌కి చంద్రబాబు గవర్నర్ పదవి ఇప్పించడం ఆయనకు అస్సలు నచ్చకపోగా పెద్ద అవమానంగా భావిస్తున్నారు. గవర్నర్ పదవికి తాను ఎందుకు అర్హుడిని కానని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఈ స్థాయికి రావడానికి అన్ని విధాలా సహకరించడంతోపాటు రాజ్యాంగపరమైన సమస్యలు, ఇబ్బందులు వచి్చనప్పుడు కూడా అవన్నీ తన భుజానే వేసుకుని పరిష్కరించే వాడినని.. అలాంటి తనను కాదని అశోక్‌కి పదవి ఇవ్వడం అన్యాయమని యనమల మథనపడుతున్నారు.
ప్రతీ అవసరానికి వాడుకున్నారు..
టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కే పరిస్థితి లేకపోవడం, భవిష్యత్తులోనూ అలాంటి అవకాశాలు వస్తాయో లేదో తెలీని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. యనమల తాను గౌరవప్రదమైన పదవిని పొంది ఆ తర్వాత రాజకీయాల నుంచి ని్రష్కమించే అవకాశం లేకుండా చేశారని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అవసరాలకు చంద్రబాబు తనను వాడుకుని ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేశారని, రాజకీయాల నుంచిఅవమానకరంగా రిటైర్ అయ్యేలా చేశారని ఆయన మండిపడుతున్నారు.
ఇటీవల తన ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసినా రెన్యువల్ చేయకుండా ఇబ్బందికరంగా పక్కకు తప్పించి జూనియర్లు, కొత్తగా వచి్చన వారికి అవకాశం ఇవ్వడం తనను అవమానించడమేనని ఆయన చెబుతున్నట్లు సమాచారం. చంద్రబాబు రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదగడానికి.. టీడీపీ నిలబడడానికి తాను కూడా కారణమనే విషయాన్ని మరచిపోయి ఇప్పుడు తన పట్ల ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని ఆయన కారాలుమిరియాలు నూరుతున్నారు.
వెన్నుపోటు ఎపిసోడ్‌లో నేను లేకపోతే ఏమయ్యేది?
ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఆయన చేతుల్లో నుంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చేలా చేయడంలో యనమల రామకృష్ణుడిది అత్యంత కీలకపాత్ర. అప్పట్లో అసెంబ్లీ స్పీకర్‌గా ఉండి సభలో ఎన్టీఆర్‌కు కనీసం మాట్లాడ్డానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ ఎపిసోడ్‌లో అన్ని విధాలా సహకరించడంతో చంద్రబాబు సీఎంతో పాటు టీడీపీ సారథి అయ్యారు. ఈ మొత్తం ఉదంతంలో యనమల ఆయన వెన్నంటే ఉండి సహకరించారు.
ఆ తర్వాత కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలు రాజ్యాంగపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు తనను ఉపయోగించుకున్నారని గుర్తుచేస్తున్నారు. అలాంటి తాను రాజకీయాల నుంచి హుందాగా రిటైర్ అయ్యే ఉద్దేశంతో 2014–19 మధ్య రాజ్యసభకు పంపాలని అడిగితే మంత్రి బాద్యతలు అప్పగించారని చెబుతున్నారు. కనీసం ఇప్పుడైనా రాజ్యసభ ఇవ్వాలని అడిగినా పట్టించుకోకపోగా కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా రెన్యువల్ చేయలేదని వాపోతున్నారు.
గవర్నర్ పదవి అడిగితే బాబు స్పందించలేదు..
కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కలిసి ఉండడంతో ఈసారి కచి్చతంగా టీడీపీకి ఒక గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉండడంతో అది తనకు ఇప్పించాలని యనమల కొద్దిరోజుల క్రితం నోరుతెరిచి అడిగినా చంద్రబాబు స్పందించలేదని సమాచారం. చంద్రబాబు దృష్టి అశోక్‌పై ఉండడంతో ఆయనకు పదవి ఇచ్చి తనను అవమానించారని యనమల భావిస్తున్నారు. అశోక్ కంటే తాను ఎందులో తక్కువని, పార్టీకి తాను చేసిన సేవలు, అశోక్ చేసిన సేవలు పోల్చి చూస్తే ఎవరు ఎక్కువ చేశారో తెలుస్తుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.
బీసీల పార్టీ అని చెప్పుకుంటూ పార్టీలో అత్యంత సీనియర్ బీసీ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడిని అవమానించడంపై టీడీపీలోని బీసీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక దాన్ని ప్రశ్నిస్తూ ఆయన చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఆయనపై ఎదురుదాడి చేయించారు.
చంద్రబాబు తెలివిగా పార్టీలోని బీసీ నేతలతోనే ఆయనపై ఆరోపణలు, విమర్శలు చేయించడంతోపాటు సోషల్ మీడియాలో ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేసేలా చేశారు. అప్పటి నుంచి చంద్రబాబుకు, యనమలకు గ్యాప్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఇప్పుడు గవర్నర్ పదవి అశోక్‌గజపతిరాజుకు ఇవ్వడంతో ఇక పార్టీలో తనకు తలుపులు మూసుకుపోయినట్లేనని, ఇది తనకు తీరని అవమానమని యనమల కుమిలిపోతున్నట్లు సమాచారం.