
బుధవారం మీడియా సమక్షంలో తాను పండించిన పొగాకు దిగుబడిని ట్రాక్టర్‌తో తొక్కిస్తున్న రైతు సుబ్బారెడ్డి.. (ఇన్‌సెట్‌లో) టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావుతో ఫోన్‌లో మాట్లాడుతున్న రైతు సుబ్బారెడ్డి
మా ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తావా? అంటూ పొగాకు రైతుపై ‘పచ్చ’బ్యాచ్ కన్నెర్ర
పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అతని అనుచరుల బరితెగింపు
పాడైన పొగాకునే ట్రాక్టర్‌తో తొక్కించినట్లు చెప్పాలని ఒత్తిడి
రైతుతో బలవంతంగా సాక్షి ప్రతుల దహనం..
సాక్షి, టీవీ–9 విలేకరులపైనా పోలీసులకు ఫిర్యాదు
ఎప్పుడేం జరుగుతుందోనని రైతు బిక్కుబిక్కు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘వేసిన పంట ఎండినా.. గిట్టుబాటు ధరలేక నష్టపోయినా.. అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే గుట్టుచప్పుడు కాకుండా ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవాలేగానీ తనకొచ్చిన బాధను వేరొకరి చెప్పుకోకూడదు. రైతు కన్నీటి వ్యథ రెండో కంటికి తెలియకూడదు. తన తోటివారితోపాటు పత్రికలకు, టీవీ ఛానళ్లకు తమ బాధను వెళ్లడించకూడదు. కాదూ కూడదని చెప్పుకుంటే టీడీపీ కూటమి సర్కారును తిట్టినట్లే తర్వాత బెదిరింపులు, వేధింపులు, దాడులుచేస్తాం. టార్చర్ పెట్టి నిండు ప్రాణాలు బలిగొంటాం’.. అన్నట్లుగా ఉంది రాష్ట్రంలోని టీడీపీ కూటమి పాలనలో పచ్చమూకల అరాచకపర్వం. బాపట్ల జిల్లాలో అచ్చు ఇలాంటి ఘటనే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో జరిగింది.
ఏం జరిగిందంటే..
ఇంకొల్లు మండలం ఎర్రంవారిపాలెంకు చెందిన రైతు గుదిబండి సుబ్బారెడ్డి పర్చూరు మండలం నూతలపాడు ప్రాంతంలో 40 ఎకరాల్లో నల్లబర్లీ పొగాకు సాగుచేశాడు. పండించిన పొగాకును ప్రభుత్వం కొనలేదు. దిక్కుతోచని సుబ్బారెడ్డి పొగాకును ట్రాక్టర్‌తో తొక్కించి నిరసన తెలపాలని నిర్ణయించాడు. దీంతో.. బుధవారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని టీవీ–9, సాక్షి టీవీ రిపోర్టర్లకు ఫోన్‌చేశాడు. తాను పొగాకు రైతునని, వస్తే బాధలు చెప్పుకుంటానన్నాడు.
ఇద్దరు రిపోర్టర్లు రైతు రమ్మన్న పర్చూరు మండలం నూతలపాడుకు వెళ్లారు. వారు వెళ్లేసరికి రైతు సుబ్బారెడ్డి పొగాకును ఆరుబయట పట్టలలో ఆరబెట్టి ఉన్నాడు. విలేకరులు రాగానే ట్రాక్టర్‌తో పొగాకును తొక్కించి పిండిగా మార్చాడు. మొత్తం వీడియో తీసి రైతుల కప్టాలను ప్రభుత్వానికి తెలపాలని కోరాడు. పొగాకు రైతుగా తన కష్టనష్టాలపై బైట్ కూడా ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే..
రైతు కష్టం అంతాఇంతా కాదు..
నా సొంతభూమి 40 ఎకరాల్లో ఎకరానికి రూ.లక్ష ఖర్చుచేసి పండించిన పొగాకు పంటను కొనేందుకు కంపెనీ వాళ్లు, డిపార్ట్‌మెంట్ వాళ్లు రాలేదు. దీంతో పంటను ఏంచేయాలో అర్థంకాక దాన్ని నా సొంత భూమికి ఎరువులా వాడదామని నిర్ణయించాను. నేనొక్కడినే కాదు.. చాలామంది చిన్న రైతులు, పెద్ద రైతులు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. నా బాధను పబ్లిగ్గా చెబుదామని ఈ పనిచేస్తున్నాను.
కూలీలకు డబ్బులివ్వలేక.. ఈ పంట అమ్ముకోడానికి వెసులుబాటులేక రైతు కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇవన్ని చెప్పేబాధలు కాదు. పొగాకును బయట ఉంచేదానికంటే ఎరువుగా చేసి పొలాలకు వెయ్యడమే మేలనుకున్నాను. ఎకరాకు రూ.1 లక్ష చొప్పున రూ.40 లక్షలు నష్టపోయాను. 50 శాతం సేవ్ అయ్యేదానికి కూడా లేదు. ఎవరూ పంట కొంటానని ముందుకు రావడంలేదు. అమ్మే పరిస్థితిలేదు, నిలువ ఉంచే పరిస్థితి కాదు. అందుకే ఈ పని చేస్తున్నాను.
మాపైనే విమర్శలు చేస్తావా?
ఇలా తన పొగాకు సాగు కష్టాలు మీడియాకు చెప్పుకున్న సుబ్బారెడ్డిని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఆయన అనుచరులు టార్గెట్ చేశారు. బెదిరించారు.. భయపెట్టారు. ‘అధికారంలో మేమున్నప్పుడు మా ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తావా?’ అంటూ హెచ్చరించారు. అంతటితో ఆగక.. తాను మీడియాకు అలా చెప్పలేదని రైతు సుబ్బారెడ్డితోనే బలవంతంగా చెప్పించి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టుచేశారు.
పైగా.. అతనితోనే పర్చూరు సెంటర్లో సాక్షి ప్రతులను దగ్థం చేయించారు. అంతేకాక.. రైతు బాధలను రికార్డ్ చేసిన సాక్షి, టీవీ–9 రిపోర్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎమ్మెల్యే ఏలూరి స్వయంగా సుబ్బారెడ్డికి ఫోన్‌చేసి పరోక్ష హెచ్చరికలకు బరితెగించారు.
ఎమ్మెల్యే అనుచరులు చెప్పిన రైతుల పంటే కొనుగోలు..
మరోవైపు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి పర్యటన తర్వాత నల్లబర్లీ పొగాకు కొంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా పేరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టింది. కానీ, ఎమ్మెల్యే అనుచరులు చెప్పిన రైతుల పొగాకును మాత్రమే కొంటూ మిగిలిన రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో.. చాలామంది పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నా.. పచ్చపార్టీ దౌర్జన్యాలకు వెరసి మిగిలిన వారు నోరు విప్పడంలేదు.