డెత్‌ ‘స్పిరిట్‌’.. కబళిస్తున్న కల్తీ మద్యం...! | TDP liquor syndicate loots indiscriminately | Sakshi
Sakshi News home page

డెత్‌ ‘స్పిరిట్‌’.. కబళిస్తున్న కల్తీ మద్యం...!

Jul 12 2025 5:13 AM | Updated on Jul 12 2025 5:15 AM

TDP liquor syndicate loots indiscriminately

ఇటీవల అనకాపల్లి జిల్లా పరవాడలో టీడీపీ నేత నుంచి ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఏసీ బ్లాక్‌ స్టిక్కర్లు, కారామిల్‌ రసాయనం

బ్రాండెడ్‌ మద్యం ముసుగులో నకిలీ దందా

టీడీపీ మద్యం సిండికేట్‌ అడ్డగోలు దోపిడీ

ఒక్క ఏడాదిలో రూ.వేల కోట్ల  కల్తీ విక్రయాలు.. 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్లు విక్రయించి సొమ్ము

ప్రతి మూడు మద్యం సీసాల్లో ఒకటి కల్తీనే!.. అత్యంత ప్రమాదకర స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారీ

టీడీపీ నేతల డిస్టిలరీల నుంచే అక్రమంగా స్పిరిట్‌ సరఫరా

డజనుకుపైగా యూనిట్లలో భారీగా కల్తీ సరుకు తయారీ

టీడీపీ మద్యం సిండికేట్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విక్రయాలు

కల్తీ దందా బయటపడినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

దర్యాప్తును తొక్కిపెట్టిన వైనం

కల్తీ మద్యం తీవ్ర హానికరం... ప్రాణాంతకమని వైద్యుల హెచ్చరిక

అప్పటిదాకా అలవాటైన ‘సరుకే’..! కాస్త పడగానే ‘కిక్‌’ ఇచ్చేదే..! కానీ.. ఇప్పుడెందుకో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం.. ఏమైందో తెలుసుకునేలోపే మృత్యు కౌగిట్లోకి!!ఇదేదో కోవిడ్‌ మహమ్మారి కాదు... కొత్త వైరస్‌ అంతకంటే కాదు..!!టీడీపీ మద్యం సిండికేట్‌ ముఠాలు తయారు చేస్తున్న కల్తీ మందు ఎఫెక్ట్‌ ఇదీ!ప్రమాదకర స్పిరిట్‌లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు!రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం దందా గుప్పుమంటోంది..

కల్తీ మద్యాన్ని తాగడంతో ఇటీవల పలువురు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్‌ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తప్పనిసరిగా నిర్వహిస్తున్న దాడులతో అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప తదితర జిల్లాల్లో కల్తీ మద్యం దందా ఇప్పటికే బహిర్గతమైంది. కల్తీ మద్యం తయారీకి కీలకమైన స్పిరిట్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్న టీడీపీ పెద్ద తలకాయల జోలికి వెళ్లేందుకు ఎక్సైజ్‌ శాఖ సాహసించడం లేదు. కల్తీ మద్యం రాకెట్‌ దందా వెనుక టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధుల కుటుంబాలే  ఉండటంతో వెనకడుగు వేస్తోంది!

(సాక్షి, అమరావతి):  బాటిల్‌ మీద ఏసీ బ్లాక్‌ విస్కీ అని ఉంటుంది... లోపల సరుకు మాత్రం కల్తీ..!  
సీసా మీద ఓల్డ్‌ అడ్మిరల్‌ అని అందంగా కనిపిస్తుంది... మూత తీస్తే కల్తీ మద్యం గుప్పుమంటుంది..! 
ఏస్పీవై 999 అనే ఆకర్షణీయమైన బ్రాండ్‌... అది తాగితే కల్తీ నరనరాల్లోకి పాకుతుంది...! 
రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మూడు మద్యం సీసాల్లో ఒకటి కల్తీ మద్యమే అన్నది నిఖార్సైన నిజం! దీనికి సూత్రధారులు టీడీపీ కీలక నేతలు అన్నది నగ్న సత్యం...!!  
మద్యం ప్రియుల ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ మద్యం సిండికేట్‌ ఒక్క ఏడాదిలో రూ.వేల కోట్ల దోపిడీని సాగించింది!

రాష్ట్రాన్ని కల్తీ మద్యం కబళిస్తోంది. అత్యంత హానికరమైన స్పిరిట్‌లో రంగు నీళ్లు కలిపి బ్రాండెడ్‌ మద్యంగా విక్రయించేస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో కల్తీ మద్యం రాకెట్‌ వ్యవస్థీకృతమైంది. కల్తీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పి మద్యం ప్రియుల ప్రాణాలను హరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ఆదేశాలను వక్రీకరిస్తూ బరి తెగించి స్పిరిట్‌ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. టీడీపీ సిండికేట్‌ నిర్వహిస్తున్న దుకాణాలు, బెల్ట్‌ షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రాణాలను బలిగొంటున్న వైనం ఇదిగో ఇలా ఉంది..!  

కేంద్రం ఆదేశాల వక్రీకరణ.. భారీగా స్పిరిట్‌ అక్రమ సరఫరా 
కల్తీ మద్యం రాకెట్‌ నిర్వహణకు టీడీపీ సిండికేట్‌ వేసిన పన్నాగం విస్మయపరుస్తోంది. కోవిడ్‌ సమయంలో దేశంలో శానిటైజర్లను అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో శానిటైజర్ల తయారీ కోసం అవసరమైన ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (వాడుక భాషలో స్పిరిట్‌ అంటారు) భారీగా కొనుగోలు చేసేందుకు అప్పట్లో డిస్టిలరీలను అనుమతించారు. సాధారణంగా స్పిరిట్‌ కొనుగోలుపై నియంత్రణ ఉంటుంది. పరిశ్రమలు కూడా  ఓ పరిమితికి మించి కొనుగోలు చేయకూడదు. అయితే కోవిడ్‌ వ్యాప్తి సమయంలో శానిటైజర్ల తయారీ కోసం ఆ పరిమితిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ స్పిరిట్‌ను భారీగా కొనుగోలుకు అనుమతిస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. సరిగ్గా దీన్ని టీడీపీ మద్యం సిండికేట్‌ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్‌ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల కుటుంబాలకు చెందినవే కావడంతో కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.  

యథేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలు.. 
సిండికేట్‌ దుకణాలు, బెల్టు షాపులకు సరఫరా టీడీపీ సిండికేట్‌ రాష్ట్రంలో దాదాపు డజను కల్తీ మద్యం యూనిట్లను నెలకొల్పి దందా కొనసాగిస్తోంది. రెండు మూడు జిల్లాలకు ఒక యూనిట్‌ను స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ఏరులై పారిస్తోంది. యానాంతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడుకు కూడా కల్తీ మద్యాన్ని సరఫరా చేయడం గమనార్హం. కల్తీ సరుకును బ్రాండెడ్‌ మద్యంగా విక్రయించేందుకు టీడీపీ సిండికేట్‌కు అధికారిక నెట్‌వర్క్‌ఉండటం కలసి వస్తోంది. 

ఎందుకంటే రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇక వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్‌ దుకాణాలను కూడా సిండికేట్‌ నిర్వహిస్తోంది. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్‌ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్‌ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. 

ఏడాదిలో రూ.5,280 కోట్ల దందా 48 కోట్ల కల్తీ మద్యం బాటిళ్ల విక్రయం..! 
కల్తీ మద్యం దందాను టీడీపీ సిండికేట్‌ యథేచ్ఛగా కొనసాగిస్తోంది. డిస్టిలరీలు, కల్తీ మద్యం తయారీ యూనిట్లు, దుకాణాలు, బెల్ట్‌ షాపులు.. అన్నింటినీ సిండికేటే నిర్వహిస్తోంది. ఇదే అదనుగా బ్రాండెడ్‌ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని బరితెగించి విక్రయిస్తోంది. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనని ఎక్సైజ్‌ శాఖ వర్గాలే అనధికారికంగా వెల్లడిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో మద్యం అమ్మకాల ద్వారా రూ.28,500 కోట్ల ఆదాయం వచ్చిoది. 

2025–26లో రూ.35 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. 2024–25లో 4.26 కోట్ల ఐఎంఎల్‌ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్‌ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్‌ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్‌ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్‌ బాటిళ్లు ఉంటాయి. దీన్నిబట్టి 143 కోట్ల క్వార్టర్‌ బాటిళ్లు విక్రయించినట్లు వెల్లడవుతోంది. 

మొత్తం క్వార్టర్‌ బాటిళ్లలో మూడోవంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్‌ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు.  

అత్యంత హానికరం...  ఇటీవల పలువురు హఠాన్మరణం.. 
టీడీపీ సిండికేట్‌ సాగిస్తున్న కల్తీ దందా మద్యం ప్రియులకు ప్రాణాంతకంగా మారింది. కల్తీ మద్యం తాగడం అత్యంత హానికరం, తీవ్ర అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (స్పిరిట్‌)లో వంద శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. అది మనుషులు వినియోగించకూడదు. పరిశ్రమల్లో వివిధ ఉత్పత్తుల (ఆహార ఉత్పత్తులు కాదు) తయారీలో ఉ్రత్పేరకంగా మాత్రమే వాడతారు. స్పిరిట్‌ను బాగా డైల్యూట్‌ చేసి ఆల్కహాల్‌ను 42 శాతానికి తగ్గించాలి. అనంతరమే బ్రాండెడ్‌ మద్యం తయారీలో వాడాలి. అంతకంటే ఎక్కువ శాతం ఆల్కహాల్‌ ఉంటే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరం. 

టీడీపీ సిండికేట్‌ నిర్వహిస్తున్న కల్తీ మద్యం యూనిట్లలో ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదు. ప్రమాదకర స్పిరిట్‌లో కారమిల్, రంగునీళ్లు కలిపి బ్రాండెడ్‌ మద్యంగా విక్రయిస్తున్నారు. అది తెలియని పేద, సామాన్య వర్గాలకు చెందినవారు ఆ కల్తీ మద్యాన్ని సేవించడంతో వారి ఆరోగ్యాన్ని కబళిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలువురు మద్యం ప్రియులు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలే దీనికి నిదర్శనం. టీడీపీ కల్తీ మద్యం సిండికేట్‌ ఈ చావులకు కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. 

సిండికేట్‌కు స్పిరిట్‌ సరఫరా చేసిందెవరు? 
రాష్ట్రంలో బయటపడిన కల్తీ మద్యం దందాను కప్పి­పుచ్చాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్, పోలీసు శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా కొమరగిరిపట్నం, పశ్చిమ గోదావరి పాలకొల్లు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటతోపాటు కడప, అనంతపురంలో కల్తీ మద్యం తయారీ యూనిట్లపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎక్సైజ్‌శాఖ దాడులు జరిపింది. కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రిని జప్తు చేసి కొందరిని అరెస్టు చేశారు. ఆ వెంటనే టీడీపీ పెద్దలు రంగంలోకి దిగడంతో దర్యాప్తు అటకెక్కింది. 

కల్తీ మద్యం సిండికేట్‌కు అక్రమంగా స్పిరిట్‌ను ఎవరు సరఫరా చేస్తున్నారన్నది ఈ కేసులో అత్యంత కీలకం. దీన్ని ఛేదిస్తే మొత్తం సిండికేట్‌ దందా బయటపడుతుంది. టీడీపీ కీలక నేతల కుటుంబాల ఆధ్వర్యంలో ఉన్న డిస్టిలరీల గుట్టు రట్టు అవుతుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు దర్యాప్తునకు బ్రేకులు వేశారు. టీడీపీ నేతల డిస్టిలరీల జోలికి వెళ్లకుండా ఈ కేసును పక్కదారి పట్టించాలని హకుం జారీ చేశారు.  

కల్తీ మద్యం తయారీ ఇలా... 
భారీగా స్పిరిట్‌ తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత టీడీపీ సిండికేట్‌ కల్తీ మద్యం తయారీ చేపడుతోంది. అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా వ్యవస్థను నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్‌ను డైల్యూట్‌ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్‌ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్‌ చేసి బ్రాండెడ్‌ మద్యంగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇలా కల్తీ దందా సాగిపోతోంది.  

కల్తీ మద్యంతో తీవ్ర దుష్ప్రభావాలు ఇలా... 
» కల్తీ మద్యంలో ఉండే మెటబాలిజ్డ్‌ యాసిడ్‌ మిథనాల్‌ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. న్యూరోసిస్‌ లాంటి తీవ్ర వ్యాధుల బారిన పడటంతోపాటు కంటి నరాలు దెబ్బతిని అంధత్వం సోకుతుంది. 
»    ఉదర సంబంధిత జబ్బుల పాలవుతారు. 
»  శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.  
»   హృద్రోగ సమస్యల బారిన పడతారు. 
»   కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది.  
»   తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.  

కల్తీ మద్యం దందా సూత్రధారుల పాత్రపై ష్‌...గప్‌చుప్‌
» ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎక్సైజ్‌ శాఖ వెనకడుగు  
» గుడ్లూరు కేంద్రంగా మూడు జిల్లాల్లో రాకెట్‌.. 
» ఎక్సైజ్‌శాఖ దాడుల్లో ఖాళీ బాటిళ్లు, లేబుళ్లు లభ్యం.. 
ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కందకూరు మండలం గుడ్లూరు కేంద్రంగా కల్తీ మద్యం రాకెట్‌ బట్టబయలైంది. టీడీపీ సిండికేట్‌ సభ్యుడైన వీరాంజనేయులు గుడ్లూరులోని మిట్టపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మిషన్, ఇతర సామగ్రితో పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేశాడు.  చీరాలలో స్వాదీనం చేసుకున్న కల్తీ మద్యం కేసులో కూపీ లాగితే గుడ్లూరు కేంద్రంగా సాగుతున్న దందా డొంక కదిలింది. ఎక్సైజ్‌శాఖ అధికారుల దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్‌ బాటిల్స్‌తో పాటు 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్‌ బాటిల్‌ లేబుళ్లు బయటపడ్డాయి. 

కల్తీ మద్యం క్వార్టర్‌ బాటిల్‌ను రూ.120 చొప్పున విక్రయిస్తూ ఏడాదిగా ఈ రాకెట్‌ భారీగా కొల్లగొట్టింది. నెల్లూరులో రొట్టెల పండుగను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యాన్ని భారీగా తరలించినట్లు వెల్లడైంది. అందుకోసం 400 లీటర్ల స్పిరిట్‌ను తెప్పించడం గమనార్హం. వీరాంజనేయులను అరెస్టు చేసిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు కల్తీ మద్యం రాకెట్‌ అసలు సూత్రధారుల గురించి దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఉన్నతస్థాయి ఒత్తిళ్లతోనే ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెనక్కి తగ్గినట్టు సమాచారం.  

టీడీపీ సీనియర్‌ నేత కుటుంబమే రింగ్‌ లీడర్‌
అనకాపల్లి కేంద్రంగా టీడీపీ సిండికేట్‌ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న టీడీపీ సీనియర్‌ నేత కుటుంబం దీనికి రింగ్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తోంది. ఆ కుటుంబానికి డిస్టిలరీల వ్యాపారంతో సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. డిస్టిలరీల నుంచి అక్రమంగా స్పిరిట్‌ను సరఫరా చేస్తూ కల్తీ మద్యం దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. పరవాడలో ఇటీవల కల్తీ మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌శాఖ దాడులు నిర్వహించడంతో ఈ రాకెట్‌ గుట్టు రట్టైంది. 

టీడీపీ నాయకుడు రుత్తల రాము, యలమంచిలి వెంకటేశ్వరరావు నుంచి 72 లీటర్ల స్పిరిట్, 180 మిల్లీ లీటర్ల 455 ఖాళీ బాటిళ్లు, 1,389 మూతలు, బాటిళ్లపై అతికించేందుకు ముద్రించిన ఏసీ బ్లాక్‌ స్టిక్కర్లు, కారామిల్‌ రసాయనం, యంత్ర సామగ్రిని స్వా«దీనం చేసుకున్నారు. కల్తీ మద్యాన్ని టీడీపీ సిండికేట్‌కు చెందిన బెల్ట్‌ దుకాణాల ద్వారా క్వార్టర్‌ బాటిల్‌ రూ.130 చొప్పున విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. కల్తీ మద్యం దందాకు రింగ్‌ లీడర్‌గా ఉన్న టీడీపీ సీనియర్‌ నేత కుటుంబ సభ్యులను విచారించేందుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు సాహసించకపోవడం గమనార్హం. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా సాగుతున్న దందాపై దృష్టి పెట్టలేదు.  
గోదావరి జిల్లాల్లో పాలకొల్లు స్థావరంగా... 
నాలుగు జిల్లాల్లో యథేచ్ఛగా సరఫరా.. 
గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం రాకెట్‌ పాలకొల్లును స్థావరంగా చేసుకుంది. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పారిస్తోంది. ఇటీవల పాలకొల్లులో కల్తీ మద్యం తయారీ యూనిట్‌పై ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు నిర్వహించడంతో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. 

నాలుగు జిల్లాల్లో మద్యం దుకాణాలు, బెల్ట్‌ దుకాణాల ద్వారా ఏకంగా 25 శాతం వరకు కల్తీ మద్యాన్నే విక్రయిస్తున్నట్టు సమాచారం. దీని వెనుక పశ్చిమ గోదావరి జిల్లాలో చక్రం తిప్పుతున్న ముఖ్య నేతతోపాటు ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజా ప్రతినిధి ఉన్నట్లు తెలియడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెనక్కి తగ్గారు. కేవలం పాలకొల్లులో అదుపులోకి తీసుకున్న పులి శీతల్‌ అరెస్టుతో సరిపెట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement