ఏరీ.. ఎక్కడ..!

TDP Leaders Stay Away From Public During The Corona Disaster - Sakshi

జిల్లాలో ఆచూకీలేని టీడీపీ నేతలు..

కోవిడ్‌ ప్రారంభం నుంచీ కనుమరుగు 

జనం కష్టంలో ఉన్నా పట్టించుకోని నాయకులు 

దిక్కుతోచక చెల్లాచెదురైన కార్యకర్తలు

అనుక్షణం ప్రజలతోనే ఉంటున్న అధికారపార్టీ

కరోనా బారిన పడుతున్నా భయపడకుండా ప్రజాసేవ 

కష్టం వస్తే కాపాడతారనే నమ్మకాన్ని... తమకు ఏ నష్టం రానివ్వరనే భరోసాని... ఆపదొస్తే అండగా ఉంటారనే ధైర్యాన్ని...ఇచ్చేవాడే అసలు సిసలైన నాయకుడు. అలాంటి నాయకులు జిల్లా టీడీపీలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తరుణంలోనూ వారి ఆచూకీ లేదు. నేతల తీరుతో స్వపార్టీ కార్యకర్తలు సైతం దిక్కుతోచక, జనానికి ముఖం చూపించలేక చెల్లాచెదురవుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లా రాజకీయాలు ప్రత్యేకమనే చెప్పాలి. ఇక్కడ అధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంటుందనేది వాస్తవం. అయితే ఆ కుటుంబాల్లోని వారు ప్రజలను పాలించే విధానాన్ని బట్టి ప్రజాదరణ పొందడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి..తరతరాలుగా జిల్లా ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలతో నిమిత్తం లేకుండా కొన్ని కుటుంబాల వారికే పట్టంగడుతూ వస్తున్నారు. అదే రాజకుటుంబం. విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కురుపాం ప్రాంతాల్లోని ఈ రాజకుటుంబాల సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పదవులు పొంది, అనుభవించారు. ముఖ్యంగా వీరిలో అధిక శాతం మంది టీడీపీలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజ్యం సంక్షోభంలో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు రాజ్యాన్ని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రాజుపై ఉంటుంది. కానీ జిల్లా రాజులు మాత్రం పేరుకే రాజులు తప్ప, రాచబిడ్డకు ఉండాల్సిన లక్షణాలేవీ వారిలో కనిపించడం లేదని ఎంతోమంది విమర్శలు చేస్తున్నా వారిచెవికి ఎక్కడం లేదు. చెవులుండీ వినలేని, కళ్లుండీ చూడలేని వారి అసమర్థతే వారి పతనానికి కారణమయ్యింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని తెచ్చిపెట్టింది.

ఓటమితో నేతల కనుమరుగు..
ఎన్నికల అనంతరం జిల్లాలో టీడీపీ దాదాపు చతికిలపడింది. తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను, విజయనగరం ఎంపీ స్థానంతో సహా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకున్నప్పుడే జిల్లా టీడీపీకి చావుదెబ్బతగిలింది. అయితే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిపోయినంత మా త్రాన ప్రజలను, కార్యకర్తలను పూర్తిగా టీడీపీ నేతలు విస్మరించడం వారి స్వార్థానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకులెవరూ ఈ అపవాదును తుడిచే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఫలితంగా జిల్లాలో టీడీపీని జనం పూర్తిగా మర్చిపోతున్నారు. టీడీపీనే నమ్ముకున్న సామాన్య కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారికి నాయకుడు లేడు. ప్రజల్లో పార్టీకి ఆదరణ లేదు. మరోవైపు కరోనా కష్టాలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మిగిలిన కొద్దిమంది టీడీపీకి దూరంగా ఉంటున్నారు.

విపత్తువేళా జనానికి దూరంగా...
ఇక కరోనా సమయంలోనైనా టీడీపీ నేతల్లో మార్పు వచ్చిందా అంటే అదీలేదు. గతంలో అనేకసార్లు తమకు పదవులు కట్టబెట్టిన ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకుందామనే ఆలోచన ఆ పార్టీ నాయకులకు రాలేదు. నెలల తరబడి లాక్‌ డౌన్‌ అమలు జరుగుతున్న వేళ వ్యాపారాలు లేక, పనులు దొరక్క, ఉపాధి కరువై బతుకు బరువై అనేక ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలను ఆదుకునే ఒక్క కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టలేదు. పైగా తమ సొంత ప్రాబల్యం కోసం మాత్రమే పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడారు. ఆస్తి కోసం అస్తిత్వం కోసం మాత్రమే అప్పుడప్పుడూ తళుక్కున మెరిశారు. ఆ చర్యలవల్ల వారి ప్రతిష్ఠను మరింతగా దిగజార్చుకున్నారు. అధిష్టానం ఆదేశించినపుడు తప్పనిసరై నోరువిప్పుతున్నారు. అది కూడా చేయలేని కొందరు పత్రికా ప్రకటనలతో సరిపెడుతున్నారు. జిల్లాలో ఒకరిద్దరిని మినహా ప్రజలు టీడీపీ నాయకులను చూసి కొన్ని నెలలవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. టీడీపీ హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కనీసం జనం కోసం ఒక్క సాయం కూడా చేయడం లేదు. కానీ ఇంకా ప్రజలను అమాయకులుగా భావించి వారిని నమ్మించడం కోసం అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వాట్సప్‌లలో విమర్శలు చేస్తున్నారు. సొంతపార్టీ నాయకులు చనిపోతేనే సంతాపం తెలపనివారు, ఆ కుటుంబానికి సానుభూతి తెలపడానికి ఒక్కమాట మాట్లాడనివారు ఇక జనాన్ని ఏం పట్టించుకుంటారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

జనానికి అండగా... వైఎస్సార్‌సీపీ 
కరోనాకు భయపడో లేక పదవులు ఇవ్వని ప్రజలను ఎందుకు పట్టించుకోవాలనో తెలియదుగానీ టీడీపీ నాయకులు మాత్రం పూర్తిగా కనుమరుగైపోయినా... తమ నాయకుడిని, తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వారితో పాటే కరోనాతో పోరాడుతూ, తాము ఆ మహమ్మారి బారిన పడుతున్మామని తెలిసినా ప్రజాసేవ చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే ఒకటి రెండు రోజులు లేదా మహా అయితే వారం, పదిరోజులకు మించి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కరోనా అలాకాదు. నెలల తరబడి తిష్టవేసుకుని కూర్చుంది. అయినప్పటికీ ప్రారంభం నుంచి ప్రజల కోసం నిత్యం ఏదో ఒక సాయం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు ప్రజల్లో ఆదరణను పెంచుకున్న ఆ నాయకులు ఇప్పుడు ప్రజల ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top