
జేసీ అనుచరులు ధ్వంసం చేసిన క్రిష్ణయ్య జనరల్ స్టోర్
బరి తెగించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు
వైఎస్సార్‌సీపీ కార్యకర్త షాపు ధ్వంసం
సాక్షి టాస్క్ ఫోర్స్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వద్దకు వెళ్లిన వారందరినీ ‘రప్పా రప్పాలాడిస్తాం’ అంటూ బెదిరించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఆ మాటలను నిజం చేస్తూ తాడిపత్రిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారని తెలియడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లారు. పాతకోటకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త క్రిష్ణయ్య కూడా అందులో ఉన్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు సుబ్బుతో పాటు మరో ఆరుగురు సోమవారం పట్టపగలు క్రిష్ణయ్య జనరల్ స్టోర్‌పై దాడి చేశారు. ఆ సమయంలో క్రిష్ణయ్య స్టోర్‌లో లేకపోవడంతో.. అతని భార్య లక్ష్మీదేవి, కుమారులు జగదీష్, శ్రీనాథ్‌లను బెదిరించారు. ‘వాడొచి్చ.. జేసీ ప్రభాకర్‌రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. లేకుంటే చంపేస్తాం’ అంటూ షాపులోని వస్తువులను, ఫ్రిజ్‌లను ధ్వంసం చేసి బయట పడేశారు. ఈ ఘటనపై బాధితులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రెడ్డి.. క్రిష్ణయ్య జనరల్ స్టోర్‌ను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.