
చిత్తూరు జిల్లాలో విచ్చలవిడిగా గ్రానైట్ దోపిడీ
సీనరేజ్ లేదు.. అన్నీ దొంగ బిల్లులే
బిల్లుల్లో కూటమినేతల హస్తం
చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న వైనం
బంగారుపాళ్యం మొగిలి ఘాట్ వద్ద రెండు రోజులకు క్రితం ఓవర్ లోడ్‌తో పలమనేరు వైపు నుంచి వస్తున్న ఓ గ్రానైట్ లారీ ఇంకో లారీని ఢీకొట్టింది. ఆ లారీ బిల్లులను
తనిఖీ చేయగా చిత్తూరు అసోసియేషన్ పేరిట ఉంది. తీరా.. దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అది దొంగ బిల్లు అని తేలింది.
చిత్తూరు జిల్లాలో ఇదొక్కటే కాదు. వందలాది లారీలు దొంగ బిల్లులు సృష్టించుకుని గ్రానైట్‌ను విచ్చలవిడిగా తరలిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని కట్టడి చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో కూరుకుపోయి అటువైపు కన్నెత్తి చూసేందుకూ తీరిక లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి టాస్‌్కఫోర్స్: కూటమి ప్రభుత్వంలో అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇందులో భాగంగానే ఇటీవల గ్రానైట్ అక్రమ తరలింపు వ్యవహారం పెచ్చుమీరుతోంది. ప్రభుత్వానికి రావలసిన రాయల్టీ చెల్లించకుండా ఆక్రమార్కులు అడ్డదారిలో గ్రానైట్‌ను తరలిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. గ్రానైట్ రాయి అక్రమ తరలింపు వ్యవహారంలో అక్రమార్కులు అడ్డదారులను ఎంచుకుంటున్నారు.
ఎక్కడికక్కడ తమ మనుషులతో గస్తీ నిర్వహిస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో లభించే గ్రానైట్ రాయిని అక్రమంగా లారీల ద్వారా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 400 వరకు క్వారీలు నడుస్తుండగా.. ఇందులో చాలా చోట్ల కోట్లాది రూపాయల విలువ చేసే గ్రానైట్ దిమ్మెలు మాయమవుతున్నాయి. చిత్తూరు, యాదమరి, బంగారుపాళ్యం, పాలసముద్రం, కుప్పం, గంగాధరనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, పూతలపట్టు తదితర మండలాల నుంచి ఈ వ్యవహారం జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిస్తున్నాయి.
గ్రానైట్ తరలింపునకు ఇలా..
క్వారీల నుంచి గ్రానైట్ దిమ్మెలు బయటపడితే.. వాటి విలువను అధికారులకు నివేదించుకోవాలి. తరలింపునకు అనుమతులు తీసుకోవాలి. ఈ మేరకు మైనింగ్ శాఖ అధికారులు గ్రానైట్ బండను కొలతలు వేసి లెక్కకట్టాలి. తర్వాత ఆన్‌లైన్ ద్వారా అనుమతులువస్తాయి. ఆపై రాఘవకన్‌స్ట్రక్చన్ రాయల్టీ కడితే తరలింపునకు అనుమతులు లభిస్తాయి. దీంతో పాటు క్వారీ నిర్వహకులకు స్టేషనరీ నిర్వహణ ఉంటుంది. బార్‌కోడ్‌తో ఉన్న ఈ బిల్లుల్లో గ్రానైట్ తరలింపు వివరాలు పొందుపరచాలి. అయితే వీటిని లెక్కచేయకుండా కొందరు కూటమి నేతలు కాసులు దండుకునే పనిలో పడ్డారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
దొంగబిల్లుల రారాజు ఎవరు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు నేతల కన్ను గ్రానైట్‌పై పడింది. వారు క్వారీలపై పడి కాసులు పిండుకునే పనిలో నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో రాయల్టీ వసూళ్లకు బాధ్యతలు ఉన్న సంస్థను తోసిపుచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బిల్లులే లేకుండా చాలా వరకు గ్రానైట్‌ను అమ్ముకుంటున్నారు. దీనికితోడు దొంగ బిల్లులతో గ్రానైట్ దందాకు ఆజ్యంపోస్తున్నారు. సంస్థలు, అసోసియేషన్లను తెరపైకి తీసుకొచ్చి గ్రానైట్ దందాల్లో కోట్లాకు పడగెత్తుతున్నారు. తద్వారా రాయల్టికి డుమ్మా కొడుతున్నారు. అయితే ఈ బినామీ సంస్థకు రూపశిల్పి... ఆ ‘రా’ రాజు ఎవరనేది ఇప్పుడు జిల్లాంతా హట్‌టాపిక్‌గా మారింది.
అధికారులకు పట్టదా..?
గ్రానైట్ ఆక్రమ తరలింపును అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని కట్టడి చేయాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారు. గ్రానైట్ లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నా.. అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూగర్భ గనుల శాఖ అధికారులు వీటిపై దృషిŠట్ పెడితే ఈ అక్రమాలకు ఎప్పుడో చెక్ పడేది. ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోపాటు అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకుని అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మాకు సంబంధం లేదు
ఆ బిల్లు చూశాం. అసోసియేషన్ పేరుతో ఉన్నాయి. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అదేదైనా ఉంటే వాళ్లను అడగండి. మాకు ఫిర్యాదులు వస్తే కచ్చితంగా స్పందిస్తాం. చర్యలు తీసుకుంటాం. తనిఖీలు చేస్తున్నాం. – సత్యనారాయణ, మైనింగ్‌శాఖ డీడీ, చిత్తూరు