రెచ్చగొట్టి.. రెచ్చిపోయారు

TDP Leaders High Drama At Vinayaka Nimajjanam Prattipadu - Sakshi

వినాయక నిమజ్జనంలో టీడీపీ శ్రేణుల కవ్వింపు 

గంటల తరబడి ఒకే చోట పాటలు, సినీ డైలాగులతో హంగామా

వైఎస్సార్‌ కాంస్య విగ్రహంపైకి చెప్పులు విసిరిన వైనం

పరిస్థితి అదుపుతప్పి చెప్పులు, రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

ప్రత్తిపాడు ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ తలకు తీవ్రగాయం, పలువురికి గాయాలు

ప్రత్తిపాడు : వినాయక నిమజ్జన వేడుకల్లో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టి.. రెచ్చిపోయి, పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో ప్రత్తిపాడు ఎస్‌ఐ సీహెచ్‌ ప్రతాప్‌కుమార్‌ తలకు తీవ్రగాయమైంది. పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు చౌదరి యౌత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు.

ఊరేగింపు అంకమ్మగుడి, రెడ్ల రామాలయం, పాతమల్లాయపాలెం కూడలికి చేరుకుంది. అక్కడ టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పాటలతో పాటు పార్టీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే సినిమా డైలాగు (నీ జీవో గాడ్స్‌ ఆర్డర్, నా జీవో నా ఆర్డర్, నరకడం మొదలు పెడితే ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా)లు పదే పదే పెట్టారు. గంటల తరబడి ఒకే చోట అవే పాటలు, అవే డైలాగులు పెట్టి రెచ్చగొడుతుండటంతో, కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు సర్దిచెప్పి ఊరేగింపు ముందుకు సాగేలా ప్రయత్నాలు చేశారు.

అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఏమాత్రం సంయమనం పాటించకుండా ఇందిరాగాంధీ బొమ్మ సెంటరులోని వైఎస్సార్‌ కాంస్య విగ్రహం వద్ద, రజకుల రామాలయం వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను చింపేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సీఎం ఫ్లెక్సీలను చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

అంతలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌ కాంస్య విగ్రహంపైకి, వైఎస్సార్‌సీపీ శ్రేణులపైకి చెప్పులు విసిరారు. రాళ్లు రువ్వారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వారి దాడిని ప్రతిఘటిస్తూ రాళ్లు రువ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రత్తిపాడు ఎస్‌ఐ సీహెచ్‌ ప్రతాప్‌కుమార్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతరులు కూడా గాయపడ్డారు. అంతలో సీఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, ఇరువర్గాలను చెదరగొట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top