టీడీపీకి ఓటు వేయనందుకు దళితులపై కక్ష

TDP leaders Are Trying To  Dalits Land In Kadapa District - Sakshi

ఇంటిస్థలాన్ని కాజేసేందుకు పన్నాగం  

చేతిబోరు నెపంతో గ్రామంలో పాగా

కొల్లావారిపల్లి టీడీపీ సర్పంచ్‌ నిర్వాకం 

సాక్షి,కడప(రాజంపేట రూరల్‌) : తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దళితులపై కొల్లావారిపల్లి గ్రామపంచాయతీసర్పంచ్‌ ఎం.మహేష్‌ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా కొల్లావారిపల్లిలోని మిట్ట హరిజనవాడలో పాగా వేసేందుకు పావులు కదిపాడు. 20 ఏళ్ల క్రితం తాగు నీటి కోసం 400 అడుగులు వేసినా నీరు పడకపోవడంతో వదిలేసిన బోరును తిరిగి మరమ్మతులు చేయిస్తానని ముందుకు వచ్చాడు. ఇక్కడే మోటారు బిగించి నీటిని అందిస్తానని పట్టుబట్టాడు. ఇది అంతా గ్రామ ప్రజలపై ప్రేమతో కాదు. ఆ గ్రామంపై పట్టు సాధించేందుకు చేసిన యత్నం. మండల పరిధిలోని కొల్లావారిపల్లి గ్రామ పంచాయతీకి ఇటీవల నిర్వహించిన సర్పంచ్‌ ఎన్నికల్లో మిట్ట హరిజనవాడకు చెందిన దళిత అభ్యర్థి మహేష్‌ టీడీపీ తరఫున పోటీ చేశాడు. పంచాయతీ ఎన్నికల్లో మిట్ట హరిజనవాడ ఓట్లు కీలకంగా మారాయి.

ఎప్పుడూ వైఎస్సార్‌ కుటుంబం వెన్నంటే..
ఈ గ్రామంలోని దళితులు ఎప్పుడూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం వెంటే నడిచేవారు. కమ్మ సామాజిక వర్గానికి పట్టు ఉన్న కొల్లావారిపల్లిలో వైఎస్సార్‌ సానుభూతి పరుల మీద ఎప్పుడూ కక్షసాధింపు చర్యలు కొనసాగేవి. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకి చెందిన కొల్లావారిపల్లి సర్పంచ్‌ మహేష్‌ గ్రామ సర్వే నంబరు–25లోని టి.నరసింహులుకు సంబంధించిన ఇంటిస్థలాన్ని ప్రభుత్వం పేరుతో స్వాధీనం చేసుకునేందుకు వేసిన స్కెచ్‌లో భాగంగా ఎవరి అనుమతులు లేకుండానే బోరును రీ పాయింట్‌ చేసేందుకు పూనుకున్నాడు. అడ్డుకున్న మిట్ట హరిజనవాడ ప్రజలను ‘మీకు చేతనైంది చేసుకోపోండని’ సవాల్‌ విసిరాడు.

జగనన్న పాలనలో నీటి ఎద్దడి లేదు
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగించినప్పటి నుంచి పుష్కలంగా వర్షాలు కురవడంతో ఈ రెండున్నరేళ్ల కాలంలో గ్రామంలో నీటి ఎద్దడి లేదు. గతంలో 800 అడుగుల ఉన్న బోరును సంవత్సరం క్రితం రీ బోర్‌ చేయించి 1150 అడుగుల లోతుకు చేశారు. నీటి అవసరం లేకున్నా బోరును వేయించి ఒకే పైపునకు రెండు మోటార్లకు చెందిన నీటిని వదిలితే పైపులు పగిలిపోతాయని తెలిసినా సర్పంచ్‌ ఇటువంటి పనులు చేయడం సరికాదని వారు అంటున్నారు.

తక్షణమే బోరును వేయకుండా నిలుపుదల చేయాలని మిట్ట హరిజనవాడ గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరుతున్నారు. గ్రామస్తులు గురువారం ఈ విషయాన్ని సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. అయితే సబ్‌ కలెక్టర్‌ క్యాంప్‌ లేకపోవడంతో తిరిగి శుక్రవారం వస్తామని వెళ్లిపోయారు.

చదవండి: కాపలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top