‘విజయవాడకు వెస్ట్‌ బైపాస్‌ ఉండగా మళ్లీ ఇదేమిటీ?’ | TDP Leader Vadde At Amaravati Ring Road Affected Villages Conference | Sakshi
Sakshi News home page

‘విజయవాడకు వెస్ట్‌ బైపాస్‌ ఉండగా మళ్లీ ఇదేమిటీ?’

Apr 21 2026 4:08 PM | Updated on Apr 21 2026 4:23 PM

TDP Leader Vadde At Amaravati Ring Road Affected Villages Conference

విజయవాడ:  అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పేరుతో ప్రభుత్వం నిర్బంధ భూసేకరణ చేయాలని చూస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. కొంతమంది గొంతెమ్మ కోర్కెల కోసం ఇంతమంది రైతుల పొట్ట కొట్టడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు(మంగళవారం, ఏప్రిల్‌ 21వ తేదీ), అమరావతి రింగ్‌ రోడ్డు ప్రభావిత గ్రామాల రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐదు జిల్లాలకు చెందిన రైతులతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. 

దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నగరాలకు లేని ఔటర్‌ రింగ్‌ రోడ్డు అమరావతిలో అవసరమా? అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు పునః సమీక్షించుకోవాలని సూచించారు. 

‘భూములు కోల్పోవాల్సి వస్తున్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. అమరావతి 29 గ్రామాల్లో జనాభా ఎంత?, ఈ 12 ఏళ్లలో ఎంత జనాభా పెరిగింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లోనే లేని ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ అవసరమా?, ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎవరిని సంప్రదించారు.. అసలు ఎవరికి చెప్పారు?, కనీస ఆలోచన లేకుండా రూ. 24,700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, మొక్కజొన్న కొనమంటే మంత్రి అచ్చెన్నాయుడు డబ్బుల్లేవన్నాడు.  

189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, ఇదేమైనా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నారా చంద్రబాబు. మీ హెరిటేజ్ కంపెనీ విస్తరణ అనుకున్నారా చంద్రబాబు. రైతులు... రైతుల భూములు మీకు చీమలు...దోమలు మాదిరి కనిపిస్తున్నాయా?, విజయవాడకు వెస్ట్ బైపాస్ ఉండగా కొత్తగా రింగ్ రోడ్డు అవసరమా?, జాతీయ రహదారులకు 70 మీటర్లు చాలని కేంద్రం చెబుతోంది. కానీ ప్రభుత్వం 140 నుంచి 250 మీటర్లు తీసుకోవాలని చూస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పై పోరాటం చేయాల్సిందే’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement