ఒంగోలు కలెక్టరేట్ ఎదుట యాదవుల నిరసన
ప్రకాశం జిల్లాలో యాదవులపై చంద్రబాబు సామాజికవర్గం దాడి
టీడీపీ కార్యాలయంలోనే గడ్డపార, కర్రలు, రాడ్లతో దాడి చేసి దాష్టీకం
బాధితులపైనే సీఐ శేషగిరిరావు కేసు నమోదు చేశారు
ఒంగోలు కలెక్టరేట్ వద్ద బీసీలు, యాదవులు భారీ నిరసన
ఒంగోలు వన్‌టౌన్: ‘‘గొల్ల నాకొ..ల్లారా మిమ్మల్ని చంపితే ఎవరొస్తారురా’’ అని దూషిస్తూ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వారు యాదవులను టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గడ్డపారతో హత్యాయత్నం చేయడంపై సోమవారం బీసీలు మండిపడ్డారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీలు, యాదవులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతూ మధుబాబు అనే వ్యక్తి గొర్రెలు కాసుకోవడానికి ఈదుమూడి గ్రామం మీదుగా వెళుతుంటే అధికార పార్టీ సామాజికవర్గం వారు దాడి చేశారని పేర్కొన్నారు.
అనిల్ అనే యువకుడిపైనా అదే రోజు దాడి చేశారన్నారు. అనంతరం వీరిని గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారన్నారు. బాధితులు సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేస్తే.. చిన్న కేసు పెట్టిన పోలీసులు, నిందితులు ఫిర్యాదు చేస్తే బాధితులపై ఎదురు కేసు నమోదు చేశారని, సీఐ నిందితులకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు.
ఈదుమూడి గ్రామాన్ని సీఎం చంద్రబాబు పీ–4 గ్రామంగా స్వయంగా దత్తత తీసుకున్నారని, ఇదే గ్రామంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు యాదవులు, బీసీలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈదుమూడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు.
అసలేం జరిగిందంటే..
బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలేనికి చెందిన గొర్రెల కాపరులు ఎల్లావుల అనిల్, వడ్లమూడి మధు వేసవిలో గొర్రెల మేత కోసం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి తమ మందతోపాటు వెళ్లి ఇక్కడే ఉంటూ గొర్రెలు మేపుకుంటున్నారు. ఈ నెల 7న ఆదివారం గొర్రెలు బీడు భూముల్లో తిరుగుతుండగా ఆ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ సామాజికవర్గానికి చెందిన నాయకులు ‘‘ఎవడ్రా నా కొ... మా ఊరిలో.. మా పొలాల్లో గొర్రెలు మేపడానికి’’ అంటూ కులం పేరుతో దూషిస్తూ వారిపై దాడి చేశారు.
అదేరోజు సాయంత్రం గొర్రెలను తోలుకుని వెళ్తున్న బాధితులను అధికార పార్టీకి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, సుబ్రమణ్యం, కావూరి నాగార్జున, రంగారావు, వెంకట్రావు, ప్రసాద్ టీడీపీ కార్యాలయంలోకి ఈడ్చుకెళ్లి వెళ్లి కర్రలు, గడ్డపార, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ‘‘మేం అధికారంలో ఉన్నాం.. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెప్తే చంపేస్తాం గొల్ల నా కొ...’’ అంటూ బెదిరించారు. గాయాలపాలైన బాధితులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చేరి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


