వెల్లువలా ఫిర్యాదులు | TDP Govt Not Responding In Victims: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వెల్లువలా ఫిర్యాదులు

Published Wed, Mar 26 2025 3:11 AM | Last Updated on Wed, Mar 26 2025 3:11 AM

TDP Govt Not Responding In Victims: Andhra pradesh

విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బారులుతీరిన అర్జీదారులు

సమస్యల నిలయంగా పరిష్కార వేదిక

పదేపదే దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం

నెలల తరబడి తిరుగుతున్న బాధితులు

వృద్ధులు, మహిళలు, రైతన్నలు, పేదలు, పిల్లల అగచాట్లు.. 

రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ బృందం పరిశీలనలో వెల్లడి  

సాక్షి నెట్‌వర్క్‌:
పింఛన్‌ ఇప్పించాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల వేడుకోలు..!
తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ కాళ్లరిగేలా తిరుగుతున్న గిరిజనులు..!
రేషన్‌ కార్డులు, ఇళ్ల కోసం నెలల తరబడి ఆరాటంతో ఎదురు చూస్తున్న పేదలు..! 
అడుగు ముందుకు పడని భూముల మ్యుటేషన్లు.. పాస్‌బుక్‌లు అందక రైతన్నల గగ్గోలు..! 
స్థలాలు ఆక్రమణలకు గురై తీవ్ర ఆందోళనలో సామాన్యులు..! 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక చదువులు మధ్యలో ఆగిపోయిన పిల్లలు..!

ఇంతమంది ఇన్ని సమస్యలతో ప్రభుత్వ కార్యాల­యాలకు వస్తున్నా పరిష్కారం లభిస్తుందనే భరోసా ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరి­ష్కార వేదిక ఓ ప్రహసనంగా.. సమస్యల నిలయంగా మారింది! కలెక్టర్‌ నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్న ఈ వేదిక ప్రజలకు ఏమాత్రం భరోసా కల్పించలేకపోతోంది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు తరలి వస్తున్న వారితోపాటు కార్యాలయాలను కుప్ప­లు తెప్పలుగా ముంచెత్తుతున్న అర్జీలే ఇందుకు సాక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కడ చూసినా సమస్యలతో సతమతమవుతూ నెలల తరబడి తిరుగు­తున్నవారే కనిపిస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా పరి­ష్కార వేదికల వద్దకు వచ్చిన వారిని ‘సాక్షి’ ప్రతినిధుల బృందం పలుకరించగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. గత ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కల్పిస్తూ అడుగులు ముందుకు వేసిందని, గ్రామ స్థాయిలో ఇంటి వద్దకే పౌర సేవ­లను అందచేసిందని గుర్తు చేసుకున్నారు. ఏ కారణం చేత­నైనా సరే.. అర్హుల్లో ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా లబ్ధి చేకూరేలా ఏటా రెండుసార్లు జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో పార­దర్శకంగా ప్రదర్శించి వలంటీర్ల ద్వారా ఇంటికే పథ­కాలను చేరవేసిందని చర్చించుకోవడం కనిపించింది.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురానికి చెందిన ఆయన కుమారుడు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 32లో 89 సెంట్లను రామచంద్రుడు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. ఇందులో 44 సెంట్ల భూమిని ఈశ్వరయ్య అనే వ్యక్తికి విక్రయించాడు. మిగిలిన 45 సెంట్ల భూమికి పాస్‌బుక్‌ కోసం వెళితే మూడు సార్లు సర్వే కోసం చలానా కట్టించుకున్నారు. సర్వేయర్‌ ఒక్కసారి కూడా వచ్చి సర్వే చేయలేదు. కోర్టు పరిధిలో భూమి ఉందంటూ దాట వేస్తున్నారు. దీంతో బాధితుడు నాలుగైదుసార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నమ్మలు తన కుమారుడిని పాలిటెక్నిక్‌ చదివిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యం వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ నుంచి దివ్యాంగుడైన తండ్రి సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. కాలేజీకి ఫీజు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందించింది. నిరుపేదనైన తాను ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులతోనే కుమారుడిని  చదివిస్తున్నానని, ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడుతోందని చిన్నమ్మలు వాపోయింది.

  చిత్రంలో కనిపిస్తున్న గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుణదతీలేసు  పంచాయతీ పరిధిలోని లాబేసు గ్రామం వాసులు. వీరంతా నిరుపేదలు. గ్రామానికి చెందిన18 మంది గిరిజన రైతులు సర్వే నంబర్‌ 16, 11లోని కొంత ప్రభుత్వ భూమిలో తుప్పలు తొలగించి 1995 నుంచి పంటలు పండిస్తున్నారు. సాగు హక్కు పట్టాలు మంజూరు చేయాలంటూ తొమ్మిది నెలలుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.

నేను చచ్చిన తరువాత పింఛన్‌ ఇస్తారా? 
పెన్షన్‌ కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. కలెక్టరేట్‌కు వస్తే సచివాలయానికి వెళ్లమంటారు. అక్కడికి వెళితే మళ్లీ ఇక్కడికే పొమ్మంటారు. అసలు పెన్షన్‌ ఇస్తారా? ఇవ్వరా? ఇవ్వబోమంటే మా పని ఏదో చేసుకొని బతుకుతాం. పేదలను ఇలా తిప్పుకోవడం మంచిది కాదు. నేను చచ్చిన తరువాత పెన్షన్‌ ఇస్తామంటే ఏం లాభం? గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల మంజూరు చాలా చక్కగా ఉండేది.     – మద్దయ్య, బి.తాండ్రపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు 
బండిపై బాదంపాలు విక్రయిస్తూ జీవిస్తున్నా. ఒంటరి మహిళను. ఈ ఏడాది జనవరి 22వ తేదీన చిలకలూరిపేటలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి విరిగాయి. ఆపరేషన్‌కు రూ.లక్ష ఖర్చు అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నా. నిందితుడిని గుర్తించి, పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. ప్రమాదానికి కారకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి.   –షేక్‌ సైదాబీ, కావూరు లింగంగుంట్ల, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా

ముళ్ల పొదల్లో మృతదేహాలను మోసుకుంటూ..
మా గ్రామం నుంచి నంద్యాల వెళ్లే రహదారిలో మాంటిస్సోరి స్కూల్‌ వెనుక భాగంలో 70 సెంట్ల హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అక్కడకు వెళ్లాలంటే రహదారి లేదు. పొలం గట్లపై, ముళ్ల పొదల్లో భయంభయంగా మృతదేహాలను మోసుకుంటూ తీసుకెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేరు.    – చాపిరేవుల గ్రామస్తులు, నంద్యాల జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement