బాబు సూపర్‌ సిక్స్‌ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు.. | TDP Govt Cheats AP People: Chandarababu Fake Promises on Super Six Schemes | Sakshi
Sakshi News home page

బాబు సూపర్‌ సిక్స్‌ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..

Jan 3 2026 5:11 AM | Updated on Jan 3 2026 7:16 AM

TDP Govt Cheats AP People: Chandarababu Fake Promises on Super Six Schemes

ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్‌ సిక్స్‌ హామీలు ప్రకటించిన చంద్రబాబు 

బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం

త్రికరణశుద్ధిగా నెరవేరుస్తామని ప్రమాణం చేస్తూ బాండ్లలో చెప్పిన చంద్రబాబు

2024 జూన్‌ నుంచే అమలు చేస్తామని హామీ.. రెండేళ్లు అవుతున్నా ఎక్కడి హామీలు అక్కడే 

టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్ల దుమ్ము దులుపుతున్న ప్రజలు 

బాబు ష్యూరిటీ బాండు... మోసం గ్యారంటీకి బ్రాండ్‌ అంటూ మండిపాటు

బాబు సర్కారు బాకీని లెక్కగడుతూ... 

కొత్త ఏడాదిలోనైనా బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్‌

50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా­ర్టీలకు రూ.4 వేలు చొప్పున పింఛన్‌ హామీని చంద్ర­బాబు అమలు చేయ­కుండా రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.  

తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు.. రెండో ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగనామం.  

దీపం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు.. తొలి ఏడాది రూ.3,218.48 కోట్లు, రెండో ఏడాది రూ.1,482.48 కోట్లు బకాయి­ప­డ్డా­రు. మొత్తంగా రూ.4,700.96 కోట్లు ఎగవేశారు.  

ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేల చొప్పున రెండేళ్లలో రూ.36 వేలు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు ఒక్కపైసా ఇవ్వకుండా రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. 

నిరుద్యోగులకు భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు చొప్పున ఇవ్వాలి. కానీ, సీఎం చంద్రబాబు ఒక్కరికి కూడా ఇవ్వకుండా రూ.14,400 కోట్లు బకాయిపెట్టారు.  

అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతు­కు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలే ఇచ్చి.. రూ. 30 వేలు ఎగ్గొట్టారు. తద్వారా రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్‌ నుంచే ప్రారంభమవుతుందంటూ ఇంటింటికీ బాండ్లు పంచిన టీడీపీ కూటమి నయవంచనకు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ..’ అంటూ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇంటింటికీ పంచిన బాండ్లు ప్రకారం తమకు రావాల్సిన మొత్తాన్ని లెక్కగట్టి వడ్డీతో సహా కొత్త ఏడాదిలోనైనా చెల్లించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే.. 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్‌ సిక్స్‌ హామీలను చంద్రబాబు ప్రకటించారు.

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. ఐదేళ్లలో చేకూరే లబ్ధిపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా కుచ్చుటోపీ పెట్టారు! చంద్రబాబు ప్రజలకు ఎగ్గొట్టిన ఆ మోసాల ఖరీదు ఏకంగా రూ.లక్షన్నర కోట్లు!!

ఆ మోసాలకు సాక్ష్యాలు.. ఇంటింటా బాబు బాండ్లు
మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి, టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. కుటుంబ యజమాని ఫోన్‌ నంబర్‌ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్‌ వెబ్‌ సైట్‌ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నంబరును టీడీపీ మేనిఫెస్టో డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్‌ సిక్స్‌సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లలో ఒనగూరే ప్రయోజనాలను హోరెత్తించారు.

టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్‌ నంబర్‌కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. ఆ బాండ్లను కుటుంబ సభ్యుల ముందే డౌన్‌లోడ్‌ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్‌ సిక్స్‌సహా హామీలన్నీ 2024 జూన్‌ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో చెప్పారు. కానీ ఇంతవరకు ఆ బాండ్లలో ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో మోసపోయామని ప్రతి ఇంటా ప్రజలు ఆక్రోశిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ సహా వివిధ హామీల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. 

నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఎగవేత..
సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఇంతవరకు నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున 2024–25లో రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. 2025–26 బడ్జెట్‌లోనూ నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అంటే.. ఈ ఏడాది నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినట్లే. ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.72 వేలు! ఇప్పటికే నిరుద్యోగ భృతి కింద యువతకు సీఎం చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయిపడ్డారు. 

సుఖీభవ బకాయిలు రూ.16,747.52 కోట్లు
ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది దీన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. అంటే.. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలకుగానూ రూ.పదివేలే విదిల్చి.. ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.

ఆడబిడ్డ నిధితో ఎగ్గొట్టింది రూ.64,800 కోట్లు 
సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం మరొ­కటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఏటా రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. 2024–25, 2025–26 బడ్జెట్‌లలో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేలు చొప్పున చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.36 వేలు! ఆడబిడ్డ నిధి కింద సీఎం చంద్రబాబు మహిళలకు ఇప్పటికి రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. 

50 ఏళ్లకే పెన్షన్ల పేరుతో వంచన..
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు  పెన్షన్‌ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్‌ రూపంలో ఇవ్వాలి. తొలి ఏడాది వారికి పెన్షన్‌ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్‌లోనూ ఆ పథకానికి పైసా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాది కూడా ఎగ్గొట్టినట్టే. ఈ వర్గాలకు చెందిన వారికి ఎన్నికల హామీని నెరవేర్చకుండా రెండేళ్లలో పెన్షన్‌ కింద చంద్రబాబు రూ.96 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద ఇప్పటికే 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం చంద్రబాబు పెన్షన్‌ రూపంలో రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.

తుస్సుమన్న ఉచిత బస్సు..
మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్ల మేర ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26లో ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా.. అందులో ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు.

తొమ్మిది రకాల సర్వీసులను ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు.

తల్లులకు ఎగ్గొట్టింది రూ.19,848.64 కోట్లకుపైనే!
తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్‌ (యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు.

‘దీపం’లో రూ.4,700.96 కోట్లు ఎగవేత..
దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్‌ ధర రూ.855 ఉంది. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు మాత్రమే రూ.865 కోట్లు  ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement