‘ఆడబిడ్డ నిధి’కి సమాధి | TDP Govt Cheating AP Women: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘ఆడబిడ్డ నిధి’కి సమాధి

May 18 2025 4:53 AM | Updated on May 18 2025 10:59 AM

TDP Govt Cheating AP Women: Andhra Pradesh

1.80 కోట్ల మంది మహిళలను నమ్మించి మోసం

ఏడాదికి రూ.18 వేల చొప్పున ఇప్పటికే రూ.32,400 కోట్లు నష్టపోయిన మహిళలు

పేదలు సంపాదిస్తున్నారంటూ పూర్తిగా మంగళం పాడేసిన సీఎం చంద్రబాబు

సంస్కరణలతో సంపద సృష్టిస్తున్నందునే పేదల్లో సంపాదన  పెరిగిందట

2029 నాటికీ  పేదరికం ఉంటే పీ4తో ‘ఆడబిడ్డ నిధి’ని అనుసంధానిస్తామని

కర్నూలు సభలో తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి సూపర్‌ సిక్స్‌లో ప్రధాన 

హామీని అటకెక్కించడంపై భగ్గుమంటున్న మహిళలు  

మరోమారు నమ్మించి మోసం చేశారని మండిపాటు

సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వా­ల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతిన­బూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పు­కొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టుల­య్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.

ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.

ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.

నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.

1.80 కోట్ల మందికి ఎగనామం 
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి. గత బడ్జెట్‌లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్‌లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.

జగన్‌ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 
2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్‌ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్‌ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్‌మోహన్‌రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్‌ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.

బలవంతంగా దుకాణాల మూసివేత 
కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్‌ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలా
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్‌ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు 
(చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్‌)

రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్‌ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్‌)

భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారం

బకాయిలతో కలిపి ఇవ్వాలి
చంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్‌ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలు

ప్రజలు మోసపోయారని తెలుస్తోంది
2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది.  – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలు

బాబువన్నీ బూటకపు హామీలే
గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్‌తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం.   – ఎస్‌కే మస్తాన్‌బీ, నెల్లూరు

ఆడబిడ్డ నిధి ఇవ్వరా?
కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీ­గానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి.    –  కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లా

మాట నిలుపుకోవాలి
అధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామ­న్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు.    – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా 

ఈ పథకం అమలు కాదిక
ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది.    – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లా

మరోసారి మోసం చేస్తున్నారు
అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది.      – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లా

ప్రభుత్వంపై నమ్మకం పోయింది 
కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది.    – పి యేసమ్మ, ప్రకాష్‌ నగర్, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement