
‘పరిటాల’ ఇలాకాలో దారుణం
దళిత మైనర్ బాలికపై ఆర్నెల్లుగా అత్యాచారం
వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు కొనసాగిన దాష్టీకం
అభం శుభం తెలియని బాలికను మానవ మృగాలు కనీ వినీ ఎరుగని రీతిలో దారుణంగా కాటేశాయి.. స్కూలుకెళ్లే పిల్లలను సైతం వదిలి పెట్టని దారుణ రోజులు దాపురించాయి.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది వంతు లేసుకుని.. వీడియో తీసి బెదిరిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా బలాత్కారం చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది.. అధికారం అండ ఉండగా అడిగే వారు లేరని ఏకంగా ఆరు నెలల పాటు కీచక పర్వం కొనసాగించడం విస్తుగొలుపుతోంది.. తండ్రి లేని పిల్ల.. మతి స్థిమితం లేని తల్లి.. పైగా ఎస్సీ బాలిక.. ఏం చేస్తుందిలే అన్న కండ కావరం, అధికార మదంతో ఆ బరితెగింపు రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు అద్దం పడుతోంది.. పాపం.. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ పరిస్థితి ఆ బాలికది.. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలనుకుని దాచుకున్న కాసింత ధైర్యాన్ని సైతం ఆ దుర్మార్గులు పదేపదే బెదిరింపులతో చంపేశారు.. దుప్పటి పంచాయితీలు, రాయ‘బేరాలు’తో వెల కట్టే పనిలో పాలకులు బిజీగా ఉండటం దురదృష్టం.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ అల్లరి మూకలు కొన్ని నెలల పాటు పదే పదే అత్యాచారం చేశారు.
వీడియోలు తీసి మరీ ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నేతల ఒత్తిడితో ఇప్పటికే బాధిత బాలిక కుటుంబం ఊరి నుంచి ఎక్కడికో వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కన్నేశారు.
ఏడాది క్రితం టీడీపీ గెలుపు సంబరాల్లో తప్పెట కొడుతూ బొలెరో నుంచి జారి కింద పడి తండ్రి మృతి చెందాడు. తల్లికి మతి స్థిమితం సరిగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థినిపై తొలుత కొందరు అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. ‘నీ వీడియో ఒకటి మా వద్ద ఉంది’ అంటూ బెదిరిస్తూ.. మరికొందరు లొంగదీసుకున్నారు.
గత ఆరు నెలలుగా ఏకంగా 14 మంది ఆ చిన్నారిని ఆటబొమ్మను చేసి ఆడుకున్నారు. నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో స్థానికులు మౌనం వహించారు. గర్భం దాల్చిన బాలిక పోలీసులను ఆశ్రయించకుండా గ్రామంలోనే దుప్పటి పంచాయితీ చేసి మూసి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.
ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఇబ్బందులు తప్పవని టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. వీడియో ఉందని బెదిరిస్తూ.. ఆర్నెల్ల కాలంలో పేరూరు పంచాయతీకి చెందిన 14 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.
నిందితుల్లో బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హరిజన సురేశ్, హరిజన హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. కాగా నిందితుల్లో కొందరు ఇప్పటికే గ్రామం వదిలి పరారయ్యారు.
బాధిత కుటుంబం అదృశ్యం
గురువారం మధ్యాహ్నం నుంచి సామూహిక అత్యాచారం విషయం ఆ నోటా.. ఈ నోటా తెలియడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు బెదిరించినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులు కనిపించలేదు. రామగిరి సీఐ శ్రీధర్ వెళ్లి విచారణ చేయగా.. బాధిత బాలిక ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలే వారిని ఎక్కడికో తరలించారని గ్రామంలో చర్చ జరుగుతోంది.
అబార్షన్ చేయించుకోవాలని బెదిరింపు?
సదరు బాలిక అబార్షన్ చేయించుకుని.. ఎలాంటి కేసులకు వెళ్లకుండా ఉండాలని టీడీపీ నాయకులు కొందరు బెదిరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బాలికను ఎక్కడో టీడీపీ నాయకులే దాచి ఆస్పత్రికి తరలించి, అబార్షన్ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అబార్షన్ చేయిస్తే ఎలాంటి కేసు లేకుండా మూసేయాలని పన్నాగం పన్నినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది.
హరియాన్ చెరువుకు చెందిన రౌడీషీటర్ నాగరాజు కనుసన్నల్లో బాధిత బాలికను దాచినట్లు సమాచారం. పార్టీ కోసం ప్రాణాలు విడిచిన కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిటాల కుటుంబం నిందితుల వైపు ఉందనే విషయంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
ఎవరూ ఫిర్యాదు చేయలేదు
విషయం నా దృష్టికి రాగానే గురువారం మధ్యాహ్నం ఏడుగుర్రాలపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేశాం. అయితే ఎవరూ వివరాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. బాధిత బాలిక కుటుంబం నివసిస్తోన్న ఇంటికి తాళం వేసి ఉంది. వారి బంధువుల ఇళ్లన్నీ పరిశీలిస్తున్నాం. ఫిర్యాదు వస్తే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వెనుక ఎవరు ఉన్నా చట్టానికి అతీతులు కారు.
– శ్రీధర్, రామగిరి సీఐ
హోం మంత్రి సమాధానం చెప్పాలి
దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళిత, గిరిజనులపై రాష్ట్రంలో వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు.. బాలికలకు రక్షణ లేకుండా పోయింది. దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి అనిత ఇందుకు సమాధానం చెప్పాలి.
– సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
మహిళా సమాజం సిగ్గు పడేలా..
రాప్తాడు ఎమ్మెల్యే కూడా మహిళే. పైగా ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామానికి సమీపంలోనే ఏడుగుర్రాలపల్లి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఎమ్మెల్యే ఉంటే ఏం? లేకుంటే ఏం? శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కూడా మహిళే. ఈ కేసులో న్యాయం చేస్తారని
ఆశిస్తున్నాం.
– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే