
దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న నగలు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బరితెగించిన జనసేన, టీడీపీ నేతలు
ముగ్గురు మైనర్లతో ఏడాదిగా చోరీలు చేయిస్తున్న వైనం
అపహరించిన సెల్‌ఫోన్‌కు సిమ్ వేయడంతో పట్టుబడిన బాలురు
బయటపడిన టీడీపీ కూటమి నేతల బండారం
ఓ మంత్రి ఫోన్‌తో 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
నామమాత్రపు రికవరీతో సరి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తూ రూ.కోట్లు వెనకేసుకున్నారు అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది. చోరీ చేసిన సెల్‌ఫోన్‌లో సిమ్ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నవీన్‌మిట్టల్ కాలనీకి చెందిన జనసేన నేత బందరు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉంటాడు.
ఈయన బందరు మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ‘మాస్టర్’ ప్లాన్ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలుచెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు పదికిపైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి, చోరీ సొత్తునంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు.
పట్టించిన సిమ్
ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతోపాటు సెల్‌ఫోన్‌ను అపహరించిన మైనర్లు ఆ ఫోన్‌లో సిమ్ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్‌పై మోజుతో ఓ మైనర్ కొత్త సిమ్ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ కావటంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు.
మంత్రి ఫోన్‌తో 41ఏ నోటీసులతో సరి..!
విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కంత్రీ నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయట పడితే కూటమి పరువు పోతోందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉండడంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి, చూపినట్లు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురూ మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.