తాడేపల్లిలో జరిగింది గంజాయి హత్య కాదు.. ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదు

Tadepalli incident: AP Home Ministry Condemn Marijuana Relate - Sakshi

సాక్షి, గుంటూరు: తాడేపల్లి మైనర్ ఎస్తేర్ రాణి హత్య కేసులో నిందితుడు దయానంద రాజును అరెస్ట్‌ చేసిన పోలీసులు..  మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. ఇది గంజాయి హత్య కాదని స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వకుల్ జిందాల్. ఆపై ఏపీ హోం మంత్రి సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ప్రతిపక్ష ఆరోపణలను తోసిపుచ్చారు. అంతేకాదు.. జగనన్నది భరోసా ప్రభుత్వమని స్పష్టం చేశారు. 

ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపిన వివరాల ప్రకారం..  నిందితుడు దయానంద రాజు.. తన ఇంటికి ఎదురుగా ఉన్న ఎస్తేర్ రాణి తో అసభ్యంగా ప్రవర్తించాడు. రాణి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు అతన్ని ప్రశ్నించారు. ఆ కోపంతోనే ఎస్తేర్ రాణి పై రాజు కత్తితో దాడి చేశాడని తెలిపారామె.  కొన్ని మీడియాల్లో గంజాయి మత్తులో హత్య చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. అప్పటికే కోపంతో ఉన్న రాజు.. మద్యం సేవించి ఆ మత్తుతోనే హత్యకు పాల్పడ్డాడు. గతంలోనూ రాజు ఒక కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు.  నిందితుడిపై రౌడీ షీట్‌ తెరుస్తామని తెలిపిన ఎస్పీ.. ఘటన జరగగానే పోలీసులు వెంటనే స్పందించారని స్పష్టం చేశారు. 

మహిళల భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వమిది
సాక్షి, అమరావతి :
 రాష్ట్రంలోని మహిళల భద్రత, రక్షణకు జగనన్న ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.  నిందితులు ఎంతటివారైనా సరే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.  మంగళవారం ఏపీ సెక్రటేరియట్‌లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.. 

ఈ నెల 12 వ తేదీ అర్థరాత్రి  గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక మైనర్ బాలికపై నేరచరిత్ర ఉన్న  ఓ వ్యక్తి దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. ఇది దురదృష్టకరమైన ఘటన. మద్యం మత్తులో  ఉన్న నిందితుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గంజాయి మత్తు ఇందుకు ఏమాత్రం  కారణం కాదు. కేవలం..  వ్యక్తిగత  గొడవలే ఈ హత్యకు  కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల నిందితుని ఒక గంటలోపే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఘటనపై పలువురు నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. 
        
మహిళల భద్రత కోసం జగనన్న సర్కార్‌
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలను చేపట్టినప్పటి నుండి  రాష్ట్రంలో మహిళల భద్రతకు, రక్షణకు, సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తు‍న్నారు. పలు వినూత్న కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే దిశా చట్టాన్ని రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపడం జరిగింది. ఆపదలో ఉన్న మహిళలను వెంటనే రక్షించేందుకు దిశా యాప్ తీసుకొచ్చాం.  ఇప్పటి వరకూ  కోటి 30 లక్షల మంది  ఈ  యాప్ ను తమ స్మార్టు ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకున్నారు.  తొమ్మిది వందలకు పైగా ఈ యాప్ ద్వారా  రక్షణ పొందారు.   తప్పు ఎవరు చేసినా..ఎలాంటి వారు చేసినా.. ఎటు వంటి పక్షపాతం చూపకుండా  24 గంటల్లోపే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ శాఖ పనితీరుకు ఇదే నిదర్శనం. 

గంజాయిపై ఉక్కుపాదం
రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణా పై జగనన్న ప్రభుత్వం  ఉక్కుపాదం మోపిందని,  రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకోవడమే కాకుండా ఏజన్సీలో గంజాయి సాగును  పూర్తిగా నియంత్రించడం జరిగిందని హోం మంత్రి వనిత వెల్లడించారు. గంజాయి సాగుపై ఆధారపడిన  గిరిజన రైతులను  ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకునే విధంగా మళ్లించడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో   నాటు సారా తయారీని కూడా పూర్తిగా  నియంత్రించడం జరిగిందని, అధిక మొత్తంలో బెల్లం వ్యాపార చేసే వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.  శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల భద్రత..రక్షణ..సాధికారత అంశాలకు  జగనన్న ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆమె స్పష్టం చేశారు. వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ  ప్రధాన ప్రతి పక్షం ఏదో రకంగా ఆరోపణలు చేయడమే పరిపాటి అయిందన్నారు.

గత ప్రభుత్వంలో.. మహిళలకు భద్రత ఉండేది కాదని.. దోషులకు శిక్షలు పడకుండా నేతలు కొమ్ముకాసేవారని, కానీ.. ఇప్పుడున్న ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవని, తప్పుచేసిన వారు ఎంతటివాళ్లైనా 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటూ బాధిత కుటుంబాలకు న్యాయం అందిస్తున్నామని ఆమె తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని, జీరో ఎఫ్.ఐ.ఆర్. విధానాన్ని అమల్లోకి తేవడమే కాకుండా.. ఇవాళ టూరిస్టు పోలీస్ స్టేషన్లను కూడా  సీఎం జగన్‌ ప్రారంభించారని ఆమె గుర్తు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top