AP: సచివాలయాల పనితీరు బాగుంది 

Survey Reports Says AP Sachivalayam Employees Working Good - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటివద్దే సేవలందించే వలంటీర్ల వ్యవస్థతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు ఎప్పుడూ సమర్థవంతంగా ఉండేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులతో తనిఖీలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏమైనా లోటుపాట్లు, పనితీరు సక్రమంగా లేనట్లు తేలితే వాటిని సరిచేయడం ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించేలా వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది.

2020 అక్టోబర్‌ 20 నుంచి ఈ నెల 3వ తేదీ వరకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో 27,473 తనిఖీలను నిర్వహించారు. ఇందులో ఒకసారి కన్నా ఎక్కువసార్లు 2,870 సచివాలయాలను సందర్శించారు. అక్కడ సిబ్బంది, వలంటీర్ల పనితీరు, రంగాల వారీగా ప్రజలకు అందిస్తున్న సేవలను పరీశీలించడమే కాక.. ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, వాటి పనితీరును మదింపు చేశారు.

2021 సెప్టెంబర్‌ 1 నుంచి ఈ నెల 3 వరకు కూడా సచివాలయాల పనితీరును పరిశీలించారు. దాని ప్రకారం చూస్తే.. 80.90 శాతం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు బాగుందని.. మరో 17.99 శాతం ఓ మోస్తరుగా ఉన్నాయని తేలింది. మిగిలిన 1.11 శాతం సచివాలయాల పనితీరు బాగోలేదని తేలింది. అలాగే, 76.59 శాతం మంది వలంటీర్ల పనితీరు బాగుందని, 21.55 శాతం వలంటీర్ల పనితీరు ఓ మోస్తరుగా ఉందని.. 1.86 శాతం వలంటీర్ల పనితీరు బాగోలేదని ఆ తనిఖీల్లో తేలింది.  

తనిఖీలు విధిగా నిర్వహించండి : సీఎస్‌ 
ఈ నేపథ్యంలో.. ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పథకాల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను  క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు నెలలో తప్పనిసరిగా రెండు గ్రామ, వార్డు సచివాలాయాలను తనిఖీ చేయాలని సూచించారు. అలాగే, శాఖాధిపతులు నెలకు రెండు, కలెక్టర్లు వారంలో రెండు..జాయింట్‌ కలెక్టర్లు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీచేయాలని జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు.   

బాగోలేని, మోస్తరు పనితీరు సచివాలయాలపై ఫోకస్‌ 
ఇక పనితీరు బాగోలేని, మోస్తరు పనితీరు మాత్రమే ఉన్న సచివాలయాలపై కారణాలు అన్వేషించి ఫోకస్‌ పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌జైన్‌ తెలిపారు. మంచి పనితీరు కనబరిచేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాల్సిందిగా కోరినట్లు ఆయన పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top