‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు ముమ్మరంగా ఏర్పాట్లు

A survey of public health problems - Sakshi

ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ వినూత్న కార్యక్రమం

ఈ నెలలో ప్రారంభం

ముందుగా ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే

ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు

వైద్య శిబిరాల్లో ప్రజలకు ఉచితంగా పరీక్షలు, మందులు

అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులో ఉచితంగా చికిత్స

వైద్య శిబిరాలు ప్రారంభించే నాటికి అన్ని ప్రాంతాలకూ మందులు

రూ. 66.65 కోట్లతో మందులు, ఇతర వస్తువుల కొనుగోలు

ఇంటింటి సర్వే, ప్రజల స్క్రీనింగ్‌కు ప్రత్యేకంగా యాప్‌

సాక్షి, అమరావతి: వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా నిర్వహి ంచిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కా రానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది.

రూ.66.65 కోట్లతో మందులు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో), ఏఎన్‌ఎంలు వారి పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తు­న్నా­రు. సర్వేలో గుర్తించిన ఆరోగ్య సమస్యలున్న ప్రజ­లకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, వారికి అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇస్తారు. ఇందు కోసం రూ.66.65 కోట్ల విలువ చేసే 162 రకాల మందులు, 18 సర్జికల్‌ పరి­కరాలు, ఎమర్జెన్సీ కిట్స్, ఇతర వస్తువులను కొంటున్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ మొదలయ్యే నాటికి అన్ని ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తారు.

342 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు
10,032 విలేజ్‌ క్లినిక్స్, 542 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. ప్రతి క్యాంప్‌నకు సంబంధిత పీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్, స్పెషలిస్ట్‌ వైద్యులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 342 మంది స్పెషలిస్ట్‌ వైద్యులను గుర్తించారు. కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి కంట్రోల్‌ రూమ్‌ల నుంచి వైద్యులు, మందులు, డయగ్నోస్టిక్స్‌ లభ్యత వంటి ఇతర అంశాలపై పర్యవేక్షణ మొదలవుతుంది. 

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ ఇలా
 15వ తేదీ నుంచి కార్యక్రమంపై వలంటీర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం
♦ 16వ తేదీ నుంచి ప్రజల్లో ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ఇంటింటి సర్వే
♦  30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ 

ఉచితంగా చికిత్స
శిబిరాల్లో వైద్యుల కన్సల్టేషన్‌ అనంతరం ఎవరికైనా తదుపరి వైద్యం అవసరమైతే దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పంపుతారు. ఆస్పత్రుల్లో వారికి ఉచితంగా చికిత్స చేస్తారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు 15 రోజుల పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top