సుప్రీంకోర్టులో మిథున్‌ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు | Supreme Court Key Orders Pass AP Police In Mithun Reddy Case | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో మిథున్‌ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు

Apr 7 2025 12:40 PM | Updated on Apr 7 2025 4:43 PM

Supreme Court Key Orders Pass AP Police In Mithun Reddy Case

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.

మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు.. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ​వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాయి. దీంతో, మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు.  అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి.  ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్‌ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement