
శిక్షణ అయిపోయిందంటూ ఎమ్మెల్యేలతో లేఖలు
తొలిదశ పూర్తయిందని చెప్పాలంటూ బీసీ సంక్షేమశాఖ ఈడీలపై ఒత్తిడి
ఫైనాన్స్‌లో పెండింగ్ పెట్టిన బిల్లుల కోసం తంటాలు
రూ.కోట్లు కొట్టేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నం
సాక్షి, అమరావతి: కుట్టుశిక్షణ ఇచ్చేశాం.. ముందు మిషన్లు ఇవ్వండి.. వివరాలు తరువాత.. అంటూ ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో రూ.కోట్లు కొట్టేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏదోరకంగా నిధులు విడుదల చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు ఒకటి, రెండు రకాలుగా ప్రయత్నించినా పనికాకపోవడంతో తాజాగా ఎమ్మెల్యేల లేఖలతో రంగంలోకి దిగారు. బీసీ సంక్షేమశాఖలో రూ.257 కోట్ల తో 1,02,832 మందికిపైగా మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ ఇచ్చి మిషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన స్కీమ్‌లో రోజుకో వింతపోకడ వెలుగులోకి వస్తోంది.
బీసీ, ఈడబ్ల్యూఎస్ మహిళలకోసం అంటూ చేపట్టిన ఈ పథకానికి ఆదిలోనే అక్రమాల చెదలు పట్టిన సంగతి తెలిసిందే. కీలకనేతల అండదండలతో టెండర్ నుంచి శిక్షణ వరకు అనేక నిబంధనలకు పాతరేయడంతో ఈ స్కీమ్‌లో వేలు పెడితే భవిష్యత్‌లో చట్టపరంగా ఇబ్బందులు తప్పవని అధికారులు హడలిపోతున్నారు. దీనికితోడు జాతీయస్థాయిలో అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ (పీఎం విశ్వకర్మ) స్వయం ఉపాధి శిక్షణ కార్య్రకమాల్లో కుట్టుశిక్షణను పరిగణనలోకి తీసుకోకపోయినా.. రాష్ట్రంలో ఈ తరహా శిక్షణ చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు.
ఈ పథకానికి బిల్లులు మంజూరు చేసి తాము దోషులుగా నిలబడలేమంటూ ఫైనాన్స్ అధికారులు కొర్రీవేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఈ పథకంపై వస్తున్న విమర్శలను రాజకీయాలకు ముడిపెట్టి ప్రభుత్వ పెద్దలను తమకు అనుకూలంగా మలుచుకుని స్కీమ్‌కు సంబంధించిన బిల్లులు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఎంతమందికి, ఎక్కడ శిక్షణ ఇచ్చారో తెలియదు..
కొందరు కీలక బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారుల (ఈడీల)తో సమావేశం నిర్వహించి ఉచిత శిక్షణ మొదటిదశ పూర్తయినట్టు ఆమోదం తెలపాలని ఒత్తిడి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో దరఖాస్తులు తీసుకుని, నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇచ్చినట్టు ప్రకటించి ఇప్పుడు తమను బాధ్యుల్ని చేస్తున్నారంటూ ఈడీలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గంలో మొదటిదశ శిక్షణ పూర్తిచేసినట్టు కాంట్రాక్టర్ మనుషులు, ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల లేఖలు తీసుకుంటున్నారు.
శిక్షణ ఎక్కడ ఎంతమందికి ఇచ్చారో.. ఎవరికీ తెలియని పరిస్థితిలో మొదటిదశ పూర్తయిందంటూ ఎమ్మెల్యేల లేఖ తీసుకుని, దాన్ని సిఫారసు లేఖగా ప్రయోగించి ఫైనాన్స్ అధికారులపై బిల్లుల కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇచి్చనా, శిక్షణ ఇచ్చేవారికి నైపుణ్య అర్హతలు లేకపోయినా, అరకొరగానే శిక్షణ అయిందనిపించినా, కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్న వారికి టెండరు ఖరారు చేసినా.. పట్టించుకోని కీలకనేతలు తాము అనుకున్నదే జరగాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలను రంగంలోకి దించుతుండటం విమర్శనీయంగా మారింది.