
శ్రీసత్యసాయి జిల్లా: జమ్మూకశ్మీర్‌లో శత్రువులను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాలో అంత్యక్రియలు జరిగాయి. అధికారిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలను ఆర్మీ అధికారులు నిర్వహించారు.
కాగా, జవాన్ మురళీనాయక్ భౌతికకాయం శనివారం రాత్రి స్వగ్రామం చేరుకుంది. మధ్యాహ్నం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోగా.. అక్కడి నుంచి కల్లితండాకు రోడ్డుమార్గంలో అమరుడి భౌతికకాయాన్ని సైనిక వాహనంలో తరలించారు. దారిపొడవునా ప్రజలు పూలుచల్లుతూ..వం దేమాతరం పాడుతూ మురళీనాయక్‌కు ఘన నివాళులర్పించారు.

సైనిక దుస్తుల్లో ఠీవిగా వెళ్లిన కుమారుడు నిర్జీవంగా ఓ చెక్కపెట్టెలో కనిపించడంతో మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి బోరున విలపించారు. రాత్రి 9.30 గంటలకు మురళీనాయక్ భౌతికకాయాన్ని సైనిక అధికారులు ఇంటిముందు ఉంచడంతో ఆయన తల్లి జ్యోతిబాయి పరుగున వెళ్లి హత్తుకుంది.
‘మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా బిడ్డా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘చూడు మురళీ... నీ కోసం ఎంత మంది వచ్చారో’ అంటూ ఆమె రోదించిన తీరుతో అక్కడున్న వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీనాయక్ బంధువులు, సన్నిహితులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం మురళీనాయక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇవాళ(ఆదివారం) అధికార లాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించారు.
