తీరంలోనే కాదు.. అంతర పంటగానూ సాగుకు అనుకూలం
ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు నిర్విరామంగా పంట
మొగలి పూల నుంచి నూనె, అత్తరు, ఆకుల నుంచి నీరు ఉత్పత్తి
ఆకులు, తీగలు, కాండం నుంచి కూడా ఉప ఉత్పత్తుల తయారీ
లీటర్ నూనె ధర సగటున రూ.11 లక్షల పైమాటే
ప్రపంచంలోనే నెం.1 స్థానంలో ఒడిశాలోని బరంపురం
ఏపీలోనూ ఉద్దానం ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు
మొగలి సాగుపై సుగంధ ద్రవ్యాల బోర్డు అధ్యయనం
సాక్షి, అమరావతి: సుగంధ పరిమళాలు వెదజల్లే మొగలి పూలు అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నాయి. పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఈ పూల సాగుపై ఇప్పుడిప్పుడే రైతులు దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో మొగలి పొదలున్న ఒడిశాలో అధ్యయనం చేసిన ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సువిశాలమైన సముద్ర తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ ఈ మొగలి పూలసాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా గుర్తించింది.
తీరంలోనే కాదు.. అంతర పంటగానూ సాగు చేసే దిశగా రైతులను చైతన్యపరచడానికి అడుగులు వేస్తోంది. మొగలి పూల నుంచి నూనె, అత్తరు, ఆకులు, రెమ్మల నుంచి నీరు, ఆకులు, రెమ్మలు, స్టెమ్‌లను వివిధ రకాల హ్యాండీక్రాఫ్టŠస్‌ను తయారు చేస్తున్నారు. గతేడాది మొగలి పూల నూనె లీటరు రూ.21 లక్షలకు పైగా పలికిందంటే దీని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ సాగు విధానం..
ప్రపంచంలో మరే ఇతర వృక్ష జాతికి లేని విశిష్టత ఈ మొగలి పొదల సొంతం. మగ చెట్లు పూలు పూస్తే ఆడ చెట్లు కాయలు కాస్తాయి. ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు బతుకుతాయి. 25–30 ఏళ్ల వరకు పంటనిస్తాయి. ఒండ్రు మట్టి, ఇసుక, ఎర్రమట్టి నేలలు వీటి సాగుకు అనుకూలం. దుక్కిదున్ని 2 అడుగుల దూరంలో ఎకరాకు మట్టి స్వభావాన్ని బట్టి 150–280 మొక్కలు నాటుకోవచ్చు. లైన్ల మధ్య 8–10 అడుగులు దూరం ఉండాలి. వీటి సాగులో ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు.
ప్రారంభంలో కొద్దిగా నీళ్లుంటే చాలు. ఎకరాకు రూ.లక్ష వరకు మొదట్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వ్యయం చేస్తే చాలు. అయితే ఇప్పటి వరకు వీటికి ప్రత్యేకంగా నర్సరీలంటూ ఎక్కడా లేవు. ఇప్పటికే సాగులోని మొక్కల స్టమ్‌లను తీసుకొచ్చి చెరకుగడల మాదిరిగా నాటితే వాటంతటవే పెరుగుతాయి. వరి పొలాలు, కాలువ గట్ల వెంబడి, ఇళ్లకు, పశువుల కొట్టాలకు కంచెలా, రోడ్ల కిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌గానూ నాటుకోవచ్చు.
కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల్లోనూ అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. క్యాజరీనా, యూకలిప్టస్, జీడి మామిడి, తాటిగచ్చక వంటి వాటికి దీటుగా తీరంలో సముద్ర కోతను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా, పొలాలకు రక్షణగా కంచెగా, మడ అడవుల్లా, తుపానులు, ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఇవి దోహదపడతాయి.
ఎకరాకు 11వేల పూల ఉత్పత్తి
జూన్ నుంచి ఆగస్టులోపు మొగలి నాటుకునేందుకు అనుకూలం. ఈ పంటకు తేమ శాతం అధికంగా ఉండాలి. నాటిన మూడేళ్ల తర్వాత ఏటా 3 సీజన్‌లలో పంట (పూలు) చేతికొస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు, డిసెంబర్ నుంచి జనవరి వరకు, మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఇలా మూడు సీజన్‌లలో పూలు పూస్తాయి. మూడో ఏట నుంచి చెట్టుకు 15–20 పూలు (ఎకరాకు 5,600)పూస్తాయి. అదే ఐదేళ్లు దాటితే 35–50 పూలు (ఎకరాకు 11,200) పూస్తాయి.
ఒక్కో చెట్టు ఏడాదిలో 800–1000 వరకు పూలు పూస్తుంది. వర్షాకాలంలో పూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. తీరానికి 3 కి.మీ. వరకు సాగైన పంట నుంచి నెం.1 క్వాలిటీ పూల దిగుబడి వస్తుంది. ఉదయం 5–6 గంటల్లోపు పూచే పూలను ఫస్ట్ క్వాలిటీ పూలుగా, 6–10 గంటల మధ్య పూచే పూలను సెకండ్ క్వాలిటీగా, 10–11గంటల మధ్య థర్డ్ క్వాలిటీ పూలగా పరిగణిస్తారు. మొగ్గ దశలోనే వీటిని కట్ చేయాల్సి ఉంటుంది.
ఫస్ట్ క్వాలిటీ పూలకు ఒక్కొక్క దానికి రూ.35–45, రెండో రకానికి రూ.20–25, మూడో రకం పూలకు రూ.10–15 ధర లభిస్తుంది. పండుగ సీజన్లలో థర్డ్ క్వాలిటీ పూలు సైతం మార్కెట్‌లో రూ.40 వరకు ధర పలుకుతాయి. తీరానికి 3 కి.మీ.వరకు నాటిన మొక్కల ద్వారా వచ్చే ఫస్ట్ క్వాలిటీ పూలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గరిష్టంగా ఎకరా పూల ద్వారా 2.75 కిలోల వరకు నూనె ఉత్పత్తి అవుతుంది.
సగటున కిలో రూ.9.25 లక్షలు పలుకుతుండగా, మొగలి పూల ద్వారా తయారయ్యే అత్తరు లీటరు రూ.40–80వేలు, మొగలి జలం లీటర్ రూ.5–20వేల వరకు పలుకుతోంది. నూనెను ఫుడ్ బేవరేజస్‌లో విరివిగా వినియోగిస్తారు. అదే మొగలి జలాలను సెంటెడ్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. రైతుల నుంచి ఫ్యాక్టరీలు నేరుగా పూలను కొనుగోలు చేస్తాయి.
ఒడిశాలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి
మొగలి సాగుకు ప్రపంచంలోనే ఒడిశాలోని గంజాం జిల్లా బరంపురం పరిసర ప్రాంతాలు కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20 వేల ఎకరాల్లో మొగలి సాగవుతోంది. ఈ ప్రాంతంలో 400కు పైగా పరిశ్రమలున్నాయి. 12 వేల మందికిపైగా ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి ఈ పూలు సాగు చేసే రైతులే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా నూనె, అత్తరు, నీరు వంటి ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
ఇదే తరహాలోఉత్తరప్రదేశ్‌లోని కనోజ్‌లో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. ఏపీలో ఉద్దానం, సోంపేట, ఇచ్చాపురం, కవిటితో పాటు ప్రకాశం, చీరాల, బాపట్ల, పశి్చమ గోదావరి జిల్లాల్లో ఈ పంట సహజ సిద్ధంగా సాగవుతోంది. ఒడిశా స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లాలో 400 ఎకరాలు వరకు రైతులు మొగలి సాగు చేస్తున్నారు.
ఆదాయం వచ్చే పంటగా అభివృద్ధి చేస్తున్నాం
మొగలి పొదల సాగు రైతులకు ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకోసం లోతైన అధ్యయనం సాగుతోంది. మొగలి పొదలు పెంచే రైతులకు అవసరమైన శిక్షణ, సలహాలు, సూచనలు బోర్డు ద్వారా అందజేస్తాం. స్వల్ప వ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం ఒడిశా నుంచి నాణ్యమైన మొగలి అంట్లు అందుబాటులోకి తీసుకొస్తాం.
పంట భూముల రక్షణకు ఏర్పాటు చేసుకునే మొగలి చెట్లు పెట్టుబడిలేని ఆదాయ వనరుగా ఉపయోగపడతాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొగలి హెర్బల్ గార్డెన్స్ పెంపకాన్ని బోర్డు ద్వారా ప్రోత్సహిస్తాం. – ఆవుల చంద్రశేఖర్, సీఈవో, ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు


