
చాలా అడవులు చూసాం.. అరకు.. లంబసింగి.. శ్రీశైలంలో ఉండే నల్లమల చూశాం.. తిరుపతిలోని శేషాచలం చూశాం.. పుష్పా సినిమా షూటింగ్ చేసిన మారేడుమిల్లి అడవులు చూశాం. కానీ ఈ మడ అడవులు ఏందీ. ఏంటి వీటి స్పెషాలిటీ..
ముందు చెప్పినవన్నీ.. కొండలు.. గుట్టలు.. అంటే సముద్రమట్టానికి ఎత్తులో ఉంటాయి. అయితే ఈ మడ అడవులు మాత్రం సముద్రం.. నది కలిసే చోట ఉండే చిత్తడి ప్రాంతంలో పెరిగే చెట్ల సముదాయమే మడ అడవులు.. ఇందులో పెద్దపెద్ద వృక్షాలు ఉండవు.. అన్నీ చిన్నచిన్న చెట్లు ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఉప్పునీటిలో కూడా పెరిగే వృక్షజాతులు అన్నమాట.
ఇవి మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి మరి?
మన రాష్ట్రంలో కాకినాడ తీరం వద్ద మనం కోరింగ మాడ అడవులను చూడవచ్చు.. అంటే గోదావరి నది సముద్రంలో కలిసే చోట ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రకరకాల జీవజాలం ఉంటుంది. సముద్రం భూమ్మీదకు వచ్చేయకుండా.. నేల కోతకు గురికాకుండా ఈ అడవులు కాపాడతాయన్నమాట . సముద్రపు ఒడ్డున ఉండే పల్లెలను తుపాన్లు ముంచెత్తకుండా ఈ మడ అడవులు సరిహద్దుల్లోని సైనికుల మాదిరిగా అడ్డుగోడగా నిలబడతాయి.
ఇంకెక్కడా లేవా ఈ మడ అడవులు?
ఉన్నాయున్నాయి.. గంగానది సముద్రంలో కలిసే చోట సుందర్ బాన్స్ అడవులు పశ్చిమబెంగాల్లో ఉండగా తమిళనాడులోని పీచవరంలో కూడా ఈ మడ అడవులున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న మడ అడవులు దాదాపుగా 40 గ్రామాలను సముద్రపు పోటునుంచి కాపాడుతున్నాయి
ఇక్కడ ఏమేం చెట్లు ఉంటాయి?
భూమ్మీద పెరిగే చెట్లు ఇక్కడ పెరగవు.. ఉప్పునీరు.. మంచినీరు కలగలిసిన ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పెరిగే చిన్నచిన్న పొదలు.. తుప్పలతోబాటు విభిన్నమైన చెట్లు ఇక్కడ పెరుగుతాయి. అవిసెనియా మరినా, రిజోఫోరా అపిక్యులేటా వంటి విలువైన చెట్లు ఇక్కడ పెరుగుతాయి.
పక్షులూ.. జంతువులూ?
ఆ..ఆ ఉంటాయుంటాయి. చేపలను వేటాడే పిల్లులూ.. నీటికుక్కలు.. ఆలివ్ రిడ్లే తాబేళ్లు.. కొంగలు.. ఇక్కడ ప్రత్యేకం.. దాదాపుగా వందకుపైగా జంతువులూ.. పక్షుల రకాలు ఇక్కడ చూడొచ్చు..
అక్కడికి ఎలా వెళ్లొచ్చు.. ఎలా చూడొచ్చు?
కాకినాడకు సమీపంలోనే ఉన్న ఈ మడ అడవులు. దానిలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని చూసేందుకు కాకినాడనుంచి కారులో వెళ్లొచ్చు. ఆటోలూ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక చిత్తడి నేలల్లో నడిచేందుకు చెక్క వంతెనలు ఉంటాయి.. అటు ఇటు చూస్తూ.. పక్షుల కిలకిలలు వింటూ.. మధ్య మధ్యలో ఎదురయ్యే పిల్లులు.. నీటి కుక్కలను పలకరిస్తూ లోపలి వెళ్లొచ్చు.. ఇంకా బోట్లో కూడా అదంతా సరదాగా తిరిగి ప్రశాంతమైన వాతావరణంలో అలా సేద దీరవచ్చు.
ఇంతకూ ఈరోజు స్పెషల్ ఏమిటి?
ఏటా జూలై 26ను ప్రపంచ మ్యాంగ్రోవ్ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అందుకే ఈ ప్రత్యేక కథనం. మరింకెందుకు కాకినాడ వెళదాం.. మడ అడవులు చూద్దాం.. గోదావరిలో పరవశిద్దాం.
-సిమ్మాదిరప్పన్న