
సాక్షి, అనంతపురం: సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దిగి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల ఐదో తేదీ తర్వాత కేతిరెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు తేదీని ఖరారు చేయాలని పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లేఖ రాశారు.
వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చేందుకు ఒక తేదీని ఖరారు చేయాలని ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ సందర్బంగా లేఖలో పెద్దారెడ్డి పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలను ఇస్తామని.. అది డిపాజిట్ చేయాలని తెలిపారు. దీనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి.. పోలీసుల సూచనలు పాటిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ కూటమి సర్కారు, ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగే షాక్‌నిచ్చింది. ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
