కడప నగరంలో సౌరకాంతులు.. రూ.113.46 కోట్లతో.. | Sakshi
Sakshi News home page

కడప నగరంలో సౌరకాంతులు.. కేబినెట్‌ ఆమోదం.. రూ.113.46 కోట్లతో..

Published Sun, Sep 11 2022 12:03 PM

Solar power project with Rs113 46 crores in YSR Kadapa - Sakshi

సాక్షి, కడప: జిల్లా కేంద్రమైన కడప నగరంలో సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. రూ.113.46కోట్ల వ్యయంతో సోలార్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆ ప్లాంటు నిర్మాణానికి అవసరమయ్యే 95 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  కడప నగరం చిన్నచౌకు గ్రామ పొలంలో  1151 నుంచి 1159 వరకూ ఉన్న సర్వేనంబర్లలో ఈ 95 ఎకరాల భూమి ఉంది.

వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పంపింగ్‌ ఇతర అవసరాల కోసం కడప నగరపాలక సంస్థ ప్రతినెలా సుమారు  రూ.2కోట్ల మేర  విద్యుత్‌ చార్జీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. తద్వారా ఒక ఏడాదికి రూ.24కోట్లు కరెంటు చార్జీలకే పోతోంది. కార్మికుల జీతాలు, కరెంటు చార్జీలకే సాధారణ నిధులన్నీ ఖర్చయి పోతుండటంతో నగరంలో అభివృద్ధి పనులు చేసేందు కు నిధులు మిగలడం లేదు.

అధిక భారంగా  మారిన కరెంటు చార్జీలను  ఆదా చేసేందుకు  నగర మేయర్‌ సురేష్‌బాబు, డిప్యూటీ సీఎం అంజద్‌బాషాల ఆధ్వ ర్యంలో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. నగరపాలక సంస్థకు ప్రతి సంవత్సరం సుమారు 3కోట్ల యూనిట్ల కరెంటు అవసరమవుతోంది. దానికి తగినట్లుగా విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన  ది సిస్ట్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వారు 17 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. ఆరు సంవత్సరాల(72 నెలలు)పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది.

ఈ ఆరేళ్లలో వీధిదీపాలు, మోటార్లు, తాగునీటి సరఫరా, పంపింగ్‌ వంటి వాటన్నింటికీ సోలార్‌ పవర్‌నే వినియోగించనున్నారు.  ఇందుకోసం నగరపాలక సంస్థ భూమిని కేటాయించడంతోపాటు 72 నెలలపాటు రూ.1.50కోట్ల చొ ప్పున ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతినెలా కరెంటు చార్జీల రూపేణా కార్పొరేషన్‌ విద్యుత్‌ శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న సంస్థకు  చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఆరేళ్ల తర్వాత అనగా  నెలవారీ చెల్లింపులు పూర్తయిన పిమ్మట ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థ సొంతమవుతుంది. ఒకవేళ ప్రాజె క్టు నిర్వహణ, ఆపరేషన్‌ కా లం పెంచవలసి వస్తే అందుకు తగిన సర్వీసు చార్జీలను నగరపాలక సంస్థ వారికి చెల్లించాల్సి ఉంటుంది.  

కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం
కడప నగరపాలక సంస్థకు ప్రతినెలా వస్తున్న కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి సోలార్‌ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి భూమి కేటాయించడం శుభ పరిణామం. ప్రతినెలా కార్పొరేషన్‌ కరెంటు చార్జీల కింద విద్యుత్‌శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఆ పవర్‌ ప్రాజెక్టుకు చెల్లిస్తాం. ఆరేళ్ల తర్వాత ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థకు సొంతమై కరెంటు చార్జీలు మిగులుతాయి. అతి త్వరలోనే దీని పనులు ప్రారంభించి పూర్తి చేసేలా కృషి చేస్తాం. ఈ ప్రాజెక్టు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.   – కొత్తమద్ది సురేష్‌బాబు, మేయర్, కేఎంసీ

Advertisement
 
Advertisement
 
Advertisement