
సోలార్ రూఫ్ టాప్‌కు ప్రత్యామ్నాయ విధానం
ఖర్చు తక్కువ... అమర్చడం, నిర్వహణ తేలిక
సౌర విద్యుత్ వినియోగంలో సరికొత్త ట్రెండ్
సాక్షి, అమరావతి: కరెంటు బిల్లుల మోత నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ అవసరాలను తీర్చుకునే మార్గాల అన్వేషణ నిరంతరం జరుగుతోంది. ఆ క్రమంలోనే భానుడి కాంతి కిరణాలను విద్యుత్ శక్తిగా మార్చే సౌర ఫలకల వాడకం పెరుగుతోంది. అయితే విస్తరిస్తున్న పట్టణీకరణ కారణంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల భవంతులపై సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి.
వివిధ అంతస్తుల్లో నివాసం ఉండే వారికి సౌర విద్యుత్ సరఫరా అందని ద్రాక్షగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తాజాగా బాల్కనీలే వేదికగా ‘ప్లగ్ ఇన్’ సౌర ఫలకలు అందుబాటులోకి వస్తున్నాయి. ఖర్చు, అమర్చడం, నిర్వహణ పరంగా చూస్తే ఇవి సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నాయి.
సులువైన ప్రత్యామ్నాయం
విశాఖపట్నంలో ఓ హోటల్ యజమాని ఐదంతస్తుల భవనం మొత్తం గోడలను సౌర ఫలకలతో నింపేశారు. ఇది ఒక సోలార్ ప్యానల్ ఎలివేషన్‌తో నిర్మాణం జరిగిన ఫుల్ ఎకో గ్రీన్ హోటల్. ప్లగ్ ఇన్ ప్యానెల్స్‌ను అపార్ట్‌మెంట్లు, భవనాల బాల్కనీలో ఏర్పాటు చేసుకుని నేరుగా ఇంటిలోని ఇన్వర్టర్‌కి ప్లగ్ చేసుకోవచ్చు.
అంటే సౌర ఫలక నుంచి నేరుగా ఒకే ఒక వైరు ద్వారా విద్యుత్ సరఫరాను పొందవచ్చు. దీనికి ఎలాంటి ప్రభుత్వ, సాంకేతిక అనుమతులు కూడా అవసరం లేదు. బాల్కనీ పొడవును బట్టి, సౌర ఫలకలు అమర్చేందుకు ఉన్న వెసులుబాటును బట్టి, ఎన్ని ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోగలిగితే అంత ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు.
సూర్య కిరణాలే... భవన విద్యుత్ వెలుగులు
దేశం మొత్తం మీద వాడే విద్యుత్‌లో భవనాల్లో వినియోగం మూడవ వంతు కంటే ఎక్కువ. దేశ వ్యాప్తంగా 2027 నాటికి రూ.75,021 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌లు కోటి ఇళ్లకు అమర్చాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించింది. 2024–25 కోసం రూ.13,175.33 కోట్లను కేటాయించింది. కానీ ఇప్పటి వరకూ కేవలం 16.15 లక్షల గృహాలపై మాత్రమే రూఫ్‌టాప్ పెట్టగలిగింది. అదే బాల్కనీలో ప్లగ్ ఇన్ సౌర ఫలకలు ఏర్పాటు చేయగలిగితే నగరాలు, పట్టణాల్లోని అన్ని అపార్ట్‌మెంట్లలో సౌర విద్యుత్ వెలుగులు విరజిమ్మే అవకాశం ఉంది.