అడవి 'బిడ్డ'లకు ఆయుష్షు

SNCUs for the protection of infants in agency areas - Sakshi

ఏజెన్సీ ప్రాంతాల శిశువులకు రక్షణగా ఎస్‌ఎన్‌సీయూలు 

ఆయా కేంద్రాల్లో లక్ష దాటిన ఔట్‌ పేషెంట్‌ సేవలు 

త్వరలో మరో పది కేంద్రాల ఏర్పాటు 

పుట్టిన ప్రతి బిడ్డనూ కాపాడుకునేందుకు కార్యాచరణ  

సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు నవజాత శిశు మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఇటీవల కాలంలో వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎస్‌ఎన్‌సీయూ(స్పెషల్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్స్‌)లు నిర్వహణలోకి వచ్చాకే మరణాలు నియంత్రణలోకి వచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరలో ఆస్పత్రి ఉండటమంటేనే కష్టం. పీహెచ్‌సీ ఉన్నా అక్కడ చిన్న పిల్లలకు వైద్యం ఉండేది కాదు. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎస్‌ఎన్‌సీయూలు గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని నవజాత శిశువుల ప్రాణానికి రక్షణగా నిలుస్తున్నాయి. సీతంపేట, రంపచోడవరం, పాడేరు, శ్రీశైలం తదితర కొండ ప్రాంతాల్లోని చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. 24 గంటల వైద్యంతో ఇవి అండగా నిలుస్తున్నాయి.   

లక్ష మంది చిన్నారులకు ఔట్‌ పేషెంట్‌ సేవలు 
రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదేసి పడకలతో 23 ఎస్‌ఎన్‌సీయూలున్నాయి. ఇవి 2018, ఆగస్ట్‌లో ఏర్పాటుకాగా, బాగా నిర్వహణలోకి వచ్చింది మాత్రం 2019 జూన్‌ తర్వాతే. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో లక్ష మంది శిశువుల దాకా ఔట్‌ పేషెంట్‌ సేవలు పొందారు. శిక్షణ పొందిన నర్సులతో పాటు పీడియాట్రిక్‌ వైద్యులు, ఐసీయూ పడకలుండటంతో మెరుగైన వైద్యం లభిస్తోంది. చింతూరు ఏజెన్సీలోని కూనవరం ఎస్‌ఎన్‌సీయూలో అత్యధికంగా 10,806 మంది శిశువులకు ఔట్‌ పేషెంట్‌ సేవలందగా, మంచంగిపుట్టు ఎస్‌ఎన్‌సీయూలో 8,619 మందికి వైద్య సేవలందాయి. త్వరలోనే మరో 10 కేంద్రాలను ఒక్కొక్కటి 10 పడకలతో ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ఇప్పటికే టెండర్లనూ పిలిచారు.  

స్పెషాలిటీ సేవలు.. 
ఎస్‌ఎన్‌సీయూలో అత్యాధునిక రేడియంట్‌ వార్మర్‌లుంటాయి. వీటితో పాటు ఫొటోథెరపీ యూనిట్లూ ఉంటాయి. శ్వాస సంబంధిత వ్యాధుల నియంత్రణకు సీ–పాప్‌ యంత్రం ఉంటుంది. ఐదుగురు శిక్షణ పొందిన నర్సులు షిఫ్ట్‌ల వారీగా ఉంటారు. డాక్టర్లు 9 గంటల పాటు కేంద్రంలో ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడు అవసరమొచ్చినా ఫోన్‌ చేయగానే వచ్చేస్తారు. ఎంత ఖరీదైన మందులైనా ఎస్‌ఎన్‌సీయూల్లో శిశువులకు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సెంటర్‌లో ఐదు పడకలుంటే వాటిలో ఒకటి ప్రత్యేక సెప్సిస్‌ (ఇన్ఫెక్షన్‌లు సోకని) బెడ్‌ ఉంటుంది. ఈ విధమైన కార్యాచరణతో శిశు మరణాల నియంత్రణకు కుటుంబ సంక్షేమ శాఖ కృషిచేస్తోంది.

శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యం 
ఎస్‌ఎన్‌సీయూల వల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్‌ కోసం ఏర్పాటు చేస్తున్న పీడియాట్రిక్‌ వార్డులను కూడా కోవిడ్‌ తగ్గాక నవజాత శిశువుల వైద్యానికి ఉపయోగిస్తాం. దీనివల్ల పుట్టిన ప్రతి శిశువునూ కాపాడుకునే అవకాశం ఉంటుంది. 
– కాటమనేని భాస్కర్, కమిషనర్‌ కుటుంబ సంక్షేమశాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top