
మొబైల్‌లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆశ్లీల యాడ్స్
ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్ స్క్రోలింగ్ వీడియోల్లో కూడా ఇదే పరిస్థితి
యూట్యూబ్‌లో అయితే థంబ్ నెయిల్‌లోనే ఆసక్తి కలిగించే టైటిళ్లు
చిన్నారులు, యువతపై పెనుప్రభావం
లైబ్రరీలు, క్రీడా మైదానాలు వదిలేస్తున్న విద్యార్థులు
ఇప్పుడంతా గూగుల్ తల్లి మాయ.. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్తపుంతలు తొక్కుతున్న స్థితిలో మనం ఉన్నాం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా మన చేతిలో ఉంటోంది. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత వీటి ప్రభావానికి లోనై బానిసలవుతున్నారు. ఇప్పుడుగనుక తల్లిదండ్రులు మేల్కొనకపోతే భవిష్యత్‌లో పిల్లలు చెడుదారులు పట్టే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కందుకూరు రూరల్: యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియోను ఓపెన్ చేస్తే చాలు ముందు వచ్చేది యాడ్స్. ఆ యాడ్స్ కూడా ఆశ్లీలంగా ఉంటాయి. ఆసక్తి కలిగించేలా థంబ్ నెయిల్ టైటిళ్లు ఉంటాయి. ఉదాహరణకు.. లవ్, ఫ్యాషన్, సెక్స్ గురించి మాట్లాడుకోవడం లేదా తెలుసుకోవడంలో తప్పేముంది. వెంటనే ఈ యాప్ డౌన్‌లోన్ చేసుకోండని ఒక యాడ్. మీకు గార్ల్ ఫ్రెండ్.. బాయ్‌ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా... ఒంటరిగా ఫీలవుతున్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.. ఇది మరో యాడ్.
దారుణంగా థంబ్ నెయిల్
యూట్యూబ్ వీడియోలో థంబ్ నెయిల్ టైటిల్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. వయస్సులో ఉన్నవాళ్లు ఈ వీడియోను ఒంటరిగా చూడండి. చిన్నపిల్లలకు దూరంగా ఉండి ఈ ఆడియోను వినండి. పెళ్లిలో శృంగారం పాత్ర ఎంటీ? ఇలా రకరకాలుగా పిల్లలను ఆకర్షించే విధంగా టైటిళ్లు పెడుతున్నారు. అవి చూసిన పిల్లలు తెలిసీ తెలియక ఈ వీడియో ఎంటి ఇలా ఉంది డాడీ అని ఒకరు. శృంగారం అంటే ఎంటీ మమ్మి ఒక పాప.. ఈ వీడియోలో చిన్న చిన్న బట్టలు వేసుకున్నారెంటమ్మా అని మరొకరి ప్రశ్న.
ఇలా తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నా పిల్లల అల్లరిని తట్టుకోలేక స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. గతంలో వీడియో గేమ్స్‌కు ఎక్కువగా పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని గేమ్‌లు డౌన్‌లోన్ చేయడం లేదు. అయితే నేరుగా యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఓపెన్ చేసి వీడియో చూస్తుండు అని తల్లిదండ్రులు చెప్పి వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఆ వీడియో చూస్తూ ఉన్న సమయంలో మధ్య మధ్యలో ఆశ్లీల యాడ్స్ వస్తున్నాయి. వాటిని చూసిన పిల్లల ఆలోచనా సరళి మారిపోతోంది.
తల్లిదండ్రులే కారణమా..?
యూట్యూబ్‌లో తల్లిదండ్రులు ఏ విధమైన వీడియో చూస్తున్నారో ఆ అంశాలకు అనుగుణంగానే ఆ తర్వాత వచ్చే వీడియోలు డిస్‌ప్లే అవుతుంటాయి. తండ్రి లేక తల్లి ఎలాంటి వీడియో చూస్తున్నారో అదే ఫోన్ పిల్లలు చూస్తుంటే అలాంటివే తిరిగి మీకు ముందుగా ఓపెన్ అవుతుంటాయి.
యూట్యూబ్‌లోనే స్క్రోలింగ్ వీడియో చూసి ఏ వీడియోకి అయితే లైక్ కొడతామో అలాంటి రిలేటెడ్ వీడియోలే తిరిగి వస్తుంటాయి. ఇలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు వస్తున్నాయి. తల్లిదండ్రులు తమ ఫోన్ పిల్లలకు ఇస్తున్నారంటే మీరు ఎలాంటి వీడియో చూస్తున్నారో వారికి కూడా అర్థమవుతుంది. వాటినే పిల్లలు చూసేలా మీరే పరోక్షంగా కారణం అవుతున్నారు.
గమనించకపోతే అంతే సంగతులు..
ఇది ఇలా ఉంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హోమ్ వర్క్ ఇస్తున్నారు. ఇంటి వద్ద వర్క్ చేసేటప్పుడు అర్థం కాకపోతే తల్లిదండ్రులను అడగండి లేదా రేపు స్కూల్‌కు వచ్చిన తర్వాత ఆ వర్క్ చేయండని ఉపాధ్యాయులు చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయులు ఆ ప్రశ్న అర్థం కాకపోతే గూగుల్‌లో కొట్టండి లేదా యుట్యూబ్‌లో చూడండని చెప్తున్నారు. ఇళ్లకు వచ్చిన పిల్లలు మా సార్ ఫోన్‌లో చూసి ఈ లెక్కలు చేయమన్నాడని తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఇక ఫోన్ వాళ్ల చేతికి పోతుంది.
ఆ విద్యార్థి లెక్కలు చేస్తున్నాడా... ఇకేమైనా చూస్తున్నాడా అనేది ఆ తల్లిదండ్రులకు అర్థం కాదు. ఇలా ఓ తండ్రి కుమారుడికి ఫోన్ ఇస్తే లెక్కలకు బదులు ఏమి చూస్తున్నాడో గమనించాడు. తరువాత ఉపాధ్యాయుని వద్దకు వెళ్లి మీరు పిల్లలకు ఫోన్లు చూసి వర్క్ చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. కానీ ఇలా అందరు పేరెంట్స్ అడగలేరు కదా.
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల అవసరం ఉన్నప్పటికీ.. వాటి వినియోగంలో పరిపక్వతను, విజ్ఞతను పాటించాల్సిన అవసరం ఉంది. సామాజిక మధ్యమాలు, మొబైల్ గేమ్స్‌కు బదులు పిల్లలు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నారని మీ ఫోన్ పిల్లలకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ పి.పాపారావు, ఆల్ ఇండియా సైకలాజికల్ అసోసియేషన్
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్మార్ట్‌ఫోన్లతో అనర్థాలు
స్మార్ట్‌ఫోన్ల వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కళాశాలల్లో ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడే విద్యార్థులు కూడా వేల రూపాయల మొబైల్స్ వాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్‌లైన్ తరగతులు ఉంటాయి. కానీ ఎంత వరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. అది కాస్తా వీరే కార్యకలాపాలకు దారి తీస్తున్నాయి. కళాశాలలకు ఫోన్లు తీసుకురావడం నిషేధించేందుకు ప్రయత్నించాలి. – డాక్టర్ ఎం.రవికుమార్, టీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్
స్మార్ట్ ఫోన్లతో నష్టమే..
స్మార్ట్ ఫోన్లతో ఎంత మేలు ఉందో... అంతే చెడు కూడా ఉందని మానసిక వైద్య నిపుణులు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఫోన్లు లేని విద్యార్థులు ఉండడం లేదు. పదో తరగతికి వచ్చారంటే ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్మీడియట్ చదివే పిల్లలను కాలేజీలకు ఫోన్లు తీసుకురావద్దన్నా వినడం లేదు. కందుకూరులోని కళాశాల సంక్షేమ హాస్టళ్లలోని అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది.
ఈ ఫోన్ల వల్ల ఏ విద్యార్థి కూడా సమయానికి నిద్ర పోవడం లేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు ఓపెన్ చేసి చూస్తుంటే ఎప్పుడు ఆపుతారో కూడా తెలియని పరిస్థితి. దీని వల్లనే గాఢ నిద్ర లేక మానసికంగా యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రీడా మైదానాల్లో ఉండాల్సిన విద్యార్థులు ఫోన్లు పట్టుకొని చెట్ల కింద, రూమ్‌లలో ఉండిపోతున్నారు.