 
													విశాఖపట్నం: కనకమహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష నియమితులయ్యారు. ఇంతవరకూ ఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్‌నాయుడు కృష్ణాజిల్లా తిరుపతమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. సహాయ కమిషనర్ బాధ్యతలతో పాటు కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను శిరీష నిర్వహించనున్నారు. గతేడాది జూలై ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 29వరకు ఆమె కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.
ఆలయ ఆదాయం పెంపు, భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామచంద్రస్వామి దేవస్థానం ఆస్తులు, అనకాపల్లిలో అన్యాక్రాంతం కాగా వాటిని స్వా«దీనం చేసుకొని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. దీంతో శిరీషాను అమ్మవారి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో శిరీష ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
