
సీఎం చంద్రబాబుపై మండిపడిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
భర్త అప్పు చెల్లించలేదని అతని భార్యను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించాడు
మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇది మీ దుర్మార్గపు పరిపాలన
ఫలితమే ఈ ఘోరం
ఏడాదిగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో భర్త అప్పు చెల్లించలేదనే కారణంతో ఒక మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకుల దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు బలైపోతున్నారని మండిపడ్డారు.
మహిళను టీడీపీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించిన ఫొటోను ట్యాగ్ చేస్తూ మంగళారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘చంద్రబాబూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మ గౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసించిన ఘటన.. మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు.

ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపి విడిచి పెట్టలేదు. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.