
చిలకలూరిపేట: దైవకార్యం అయినా.. మరొకటి అయినా అగ్రతాంబూలం తమకే దక్కాలన్న అహం టీడీపీ నేతల్లో పెరిగిపోయింది. ఆ అహమే పూజారుల పట్ల శాపంగా మారింది. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం శ్రీ గోపీనాథస్వామి ఆలయంలో మాజీమంత్రి విడదల రజిని కుటుంబ సభ్యులతో పూజలు చేయించారన్న కారణంగా పూజారులకు ఆలయ కార్యనిర్వహణాధికారి నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. మాజీమంత్రి విడదల రజిని కుటుంబానిది పురుషోత్తమపట్నం కాగా.. ఈ గ్రామంలో ప్రాచీన గోపీనాథస్వామి ఆలయం ఉంది.
ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి విడదల రజిని సహకారంతో దీనిని పునర్నిర్మింపజేరు. తొలినుంచీ విడదల రజిని మామయ్య లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబం సభ్యులు గోపీనాథస్వామి భక్తులు కావడంతో తరచూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. విరాళాలు ఇస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు.
పూజలు చేయించడమే నేరమైంది
సాధారణ భక్తులతోపాటు వచ్చిన విడదల లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు సైతం శుక్రవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో టీడీపీ నాయకులకు పట్టరాని కోపం వచి్చంది. ఇంత పెద్దఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా తమను మాత్రమే పిలవాలని ఆలయ ఈవోపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఈవోపై రాజకీయ ఒత్తిడి తెచ్చి అర్చక స్వాములకు నోటీసులు ఇప్పించారు.
ఆలయంలో పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకురాకపోవడానికి కారణం తెలపాలని అర్చకులు మురికిపూడి శ్రీనివాసాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులుకు ఈవో నోటీసులు ఇచ్చారు. తమ అనుమతి లేకుండా వందలాది మంది భక్తులకు పూజలు ఏర్పాటు చేయడంపై 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారం ఆనోటా, ఈనోట బహిర్గతం కావడంతో ఇదేమి చోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. ‘పర్వదినం రోజుల్లో దేవుడికి పూజలు చేసినా పాపమై పోయిందా... ఇవెక్కడి రాజకీయాలు రా నాయనా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈవో కె.మంజూషను వివరణ కోరగా.. అనుమతి తీసుకోకుండా కుంకుమార్చన వంటి పూజలు నిర్వహించినందుకు ఆలయ అర్చకులతో పాటు, గుమస్తాకు నోటీసులు జారీ చేశామని చెప్పారు.