ఆర్బీకే తరహా సేవలు దేశంలో ఎక్కడా లేవు

Services like RBK are not available anywhere in the country - Sakshi

ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతం

వీటిపై మా ప్రభుత్వానికి నివేదికిస్తాం

గొల్లపూడి ఆర్బీకేను సందర్శించిన రాజస్తాన్‌ ఉన్నతాధికారుల బృందం  

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు గ్రామస్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని రాజస్తాన్‌ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ తరహా సేవలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. ఏపీలో వ్యవ­సాయ విధానాలు రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్ల­పూడి ఆర్బీకే–1ను రాజస్తాన్‌ అధికారులు పరిశీలించారు. ఆర్బీకే ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను.. మాయిశ్చర్‌ మీటర్, స్పీడ్‌ టెస్టింగ్‌ కిట్, కియోస్క్, తదితరాల పనితీరుతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తున్న విధానా­లను తెలుసుకున్నారు.

అనంతరం రైతులతో సమావేశమై.. వారి అభిప్రాయాలను, అనుభవా­లను ఆరా తీశారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం విజయవాడ వెళ్లే వాళ్లమని.. ఇప్పుడు అన్నీ గ్రామం విడిచి వెళ్లకుండానే ఎమ్మార్పీ రేట్లకే ఇస్తున్నారని రైతులు వివరించారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకుంటే.. ఉచితంగా పంటల బీమా అందిస్తున్నారని రైతులు తెలిపారు. తాము పండించిన ధాన్యాన్ని ఆర్బీకే ద్వారానే అమ్ముకుంటు­న్నామని, 21 రోజుల్లోనే డబ్బులు జమవుతు­న్నాయని చెప్పారు.

అన్ని పంటల ఉత్పత్తులను ఆర్బీకే ద్వారానే విక్రయిస్తున్నామని వివరించారు. అనంతరం మంగళగిరిలో ఏపీ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి ఫలితా­లను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో రాజస్తాన్‌ విత్తనాభివృద్ధి సంస్థ మార్కెటింగ్‌ చీఫ్‌ మేనేజర్‌ కేసీ మీనా, ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌ పచోరి, డిప్యూటీ డైరెక్టర్లు రాకేశ్‌ కుమార్, దన్వీర్‌ వర్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తారాచంద్‌ బోచాలియా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top