పని ఒత్తిడే కారణం
ఆరిలోవ (విశాఖ): విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 13వ వార్డు పరిధి ఆరిలోవ కాలనీలోని 9వ నంబర్ సచివాలయంలో సుంకర ఉదయ్‌కుమార్(40) టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సింహాచలం ప్రాంతానికి చెందిన ఆయన మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యారు. ప్రత్యక్ష విధులతో పాటు తూర్పు జోన్ జెడ్సీ శివప్రసాద్ నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్‌లో పాల్గొన్నారు.
సంక్రాంతి మూడు రోజుల అనంతరం ఈ నెల 17న అందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని కలెక్టర్ సూచించినట్టు జెడ్సీ శివప్రసాద్ తెలిపారు. అప్పగించిన పని తప్పకుడా చేయాల్సిందేనని, సరిగా పనిచేయనివారి గురించి క్లస్టర్ల వారీగా రిపోర్టు తీసుకొని చర్యలు చేపడతామని హెచ్చరిచారు. ఆ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ఆరిలోవ ప్రాంతంలో జెడ్సీ శివప్రసాద్ పర్యటనకు వస్తారని తెలిసి తోటి సిబ్బందితో కలసి ఆయన ముడసర్లోవ పార్కు సమీపంలో నిరీక్షిస్తున్న ఉదయ్‌కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంక్రాంతి జరుపుకోవాల్సిన ఇంట్లో విషాదం నింపావంటూ కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతం.
పని ఒత్తిడే కారణం
ఉదయ్‌కుమార్ గుండెపోటుతో మృతి చెందడానికి చంద్రబాబు ప్రభుత్వం పెడుతున ఒత్తిడే కారణమని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి తీసుకోలేనంతగా పని ఒత్తిడి పెంచారని వాపోయారు. బీపీఎల్, ఎల్‌ఆర్‌ఎస్, మాస్టర్ ప్లాన్ రోడ్లు, టౌన్ ప్లానింగ్ స్కీం వంటి పనులతో నిత్యం ఒత్తిడి ఉంటోందని చెప్పారు. దీంతోపాటు సచివాలయం సర్వేలు, ఎన్నికల వర్క్, సెలవు రోజుల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అధికారుల ఫోన్ కాన్ఫరెన్స్‌లు, అన్నీ పనులకూ ఒకేసారి టార్గెట్ ఇచ్చి సమయానికి పూర్తిచేయాలని, లేదంటే మెమోలు ఇవ్వడం చేస్తున్నారని తోటి సిబ్బంది వాపోయారు.


