సాక్షి, విశాఖపట్నం: కడుపు నింపిన కడలమ్మే.. ఇప్పుడు ఆ కుటుంబాల కళ్లలో కన్నీటి సముద్రాన్ని నింపుతోంది. ’మరో గంటలో వచ్చేస్తాం..’ అంటూ ఫోన్‌లో వినిపించిన మాటలే చివరి మాటలుగా మిగిలిపోతాయేమోనన్న భయం ఆ కుటుంబాలను క్షణక్షణం కుంగదీస్తోంది. గంటలు రోజులుగా మారుతున్నా.. సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఒకవైపు నేవీ, కోస్ట్‌గార్డ్ బృందాలు సముద్రాన్ని జల్లెడ పడుతుండగా.. మరోవైపు తీరాన కుటుంబ సభ్యులు ఆశ, ఆందోళనల మధ్య ప్రతి అలను చూస్తూ తమవారి కోసం ఎదురు చూస్తున్నారు.
అణువణువూ గాలిస్తున్నా..
జూలై 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నారు. వారిలో కారె చిన్న మినహా మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం తూర్పు నౌకాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు.
కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐసీజీఎస్ కనకలతా బారువా, ఐసీజీఎస్ వీరా నౌకలతో పాటు నేవీకి చెందిన మరో రెండు యుద్ధనౌకలు సముద్రంలో గాలిస్తున్నాయి. వీటికి తోడు ఒక డోరిమాన్ విమానం, ఒక సీకింగ్ హెలికాప్టర్, ఒక ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు గగనతలం నుంచి గాలించినప్పటికీ గల్లంతైన వారి జాడ లభించలేదు. ఎల్రక్టానిక్ సర్వేలెన్స్‌తోనూ సముద్రాన్ని అణువణువూ గాలిస్తున్నా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.
మత్స్యశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన
ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించలేదంటూ మత్స్యకార కుటుంబాలు సోమవారం మత్స్యశాఖ జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి.


