టీడీపీ నేతల బరితెగింపు | SC and ST atrocity case against TDP Leaders Unnam brothers | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల బరితెగింపు

Mar 30 2023 3:17 AM | Updated on Mar 30 2023 3:18 AM

SC and ST atrocity case against TDP Leaders Unnam brothers - Sakshi

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో మంగళవారం రాత్రి దౌర్జన్యానికి వచ్చిన టీడీపీ నేత ఉన్నం మారుతీచౌదరి

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణ­దుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించారు. మంగళవారం రాత్రి  బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడి దౌర్జన్యం చేశారు. అడ్డొచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడారు. సోషల్‌ మీడియా­లో వచ్చిన కథనాన్ని సాకుగా తీసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్‌ భాస్కర్‌ చౌదరితో పాటు పలువురు ఆ పార్టీ నాయ­కు­లు అలజడి సృష్టించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

2019 సంవత్సరంలో రైతులకు ఉచితంగా సబ్‌మెర్సిబుల్‌ మోటార్లు పంపిణీ చేశారు. అప్పట్లో మిగిలిపోయిన మోటార్లు ప్రస్తు­తం కర్ణాటకకు తరలుతున్నాయంటూ తాజా­గా సోషల్‌మీడియాలో ఓ పోస్టు వచ్చింది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమా­రులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్‌ చౌదరితో పాటు ఆ పార్టీ నాయకులు హైడ్రామాకు తెర తీశారు. మోటార్లు తరలుతున్న వాహనాన్ని ఉన్నం మారుతీ చౌదరి వెంబడించినట్లు, అది కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం లక్ష్మంపల్లికి వెళ్లినట్లు కట్టుకథ అల్లారు.

సోదరుడు ఉన్నం ఉదయ్‌ భాస్కర్‌ చౌదరి, మరికొందరు టీడీపీ నాయకులతో కలసి మారుతీ చౌదరి నేరుగా లక్ష్మంపల్లిలోని బలహీన వర్గానికి చెందిన  వడ్డే శారదమ్మ ఇంటి వద్దకు చేరుకున్నాడు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడుతున్న టీడీపీ నేతలను శారదమ్మ, కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తూ లోపలికి చొరబడ్డారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక దళిత యువకుడు విరుపాక్షిని కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. గాయపడిన అతను ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు శారదమ్మ ఇంటి వద్దకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. రాత్రి సమయంలో ఇంట్లోకి ఎలా చొరబడతారని, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్‌ఐ యువరాజ్‌ బుధవారం పోలీసు సిబ్బందితో కలిసి లక్ష్మంపల్లిలో పర్యటించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 
పోలీసుల అదుపులో ఉన్నం మారుతీ చౌదరి, నేతలు 

ఉన్నం బ్రదర్స్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్‌ భాస్కర్‌ చౌదరితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు.   మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై వడ్డే శారదమ్మ, హరిజన విరుపాక్షి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్‌ భాస్కర్‌ చౌదరి, యర్రంపల్లి సత్తి, గోళ్ల వెంకటేశులు, కైరేవు తిమ్మరాజు, కరిడిపల్లి రంగప్పలతో పాటు మరో పదిమందిపై 147, 148, 354, 422 సెక్షన్‌ల కింద  కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఉన్నం మారుతీ చౌదరితో పాటు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు కౌంటర్‌ కేసుకు తెర తీశారు. ఉన్నం మారుతీ చౌదరి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు కరిడిపల్లి రంగప్ప తననూ  కులం పేరుతో దూషించి, దాడికి యత్నించారంటూ బాధితులపైనే బుధవారం మధ్యాహ్నం శెట్టూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement