కేంద్రాన్ని మెప్పించి.. ఒప్పించి | Savings Of Rs 838 Crore Through Reverse Tendering Of Polavaram Project | Sakshi
Sakshi News home page

కేంద్రాన్ని మెప్పించి.. ఒప్పించి

Sep 23 2020 3:32 AM | Updated on Sep 23 2020 1:13 PM

Savings Of Rs 838 Crore Through Reverse Tendering Of Polavaram Project - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కల్పతరువు లాంటి పోలవరం ప్రాజెక్టుకు మాజీ సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా నేతృత్వంలోని రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ(ఆర్‌ఈసీ) బహిర్గతం చేసింది. ప్రాజెక్టు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి నీటిపారుదల విభాగానికి అయ్యే ఖర్చును విడుదల చేస్తే చాలని నాడు కేంద్రాన్ని చంద్రబాబు అభ్యర్థించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్‌ 1 నాటికి ప్రాజెక్టులో మిగిలిన నీటిపారుదల వ్యయం రూ.8,006.18 కోట్లేనని.. ఆ మేరకు కేంద్రం నిధులు ఇచ్చేసిందని పేర్కొనడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం సెక్షన్‌90(4) ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఎంత వ్యయమైతే అంత ఖర్చు కేంద్రమే భరించాలని స్పష్టం చేసింది.

భూసేకరణ చట్టం 2013 వల్ల పోలవరం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయం భారీగా పెరిగినందున ఆ మేరకు కేంద్రం నిధులు విడుదల చేయాలని పట్టుబట్టింది. పోలవరం పనులను ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ప్రక్షాళన చేయడం, రివర్స్‌ టెండర్ల ద్వారా రూ.838 కోట్లను ఆదా చేయడం, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుండటంతో ఆర్‌ఈసీ సానుకూలంగా స్పందించి 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనాలను రూ.47,725.74 కోట్లుగా ఖరారు చేసింది. జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు, నీటిపారుదల విభాగం వ్యయం రూ.43,164.83 కోట్లని నిర్ధారిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖకు మార్చి 6న ఆర్‌ఈసీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ యథాతథంగా సోమవారం ఆమోదించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పోరాటం చేయకపోయి ఉంటే చంద్రబాబు సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.36 వేల కోట్లకుపైగా పెనుభారం పడేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

బాబు నిర్వాకాలు ఇవిగో..
► పీపీఏ పర్యవేక్షణ ఉంటే పోలవరం పనుల్లో కమీషన్‌లు వసూలు చేసుకోవడం సాధ్యం కాదని పసిగట్టిన చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి 2016 సెప్టెంబర్‌ 7 అర్థరాత్రి పోలవరం పనులను దక్కించుకున్నారు.
► చంద్రబాబు ప్రతిపాదన మేరకు 2014 ఏప్రిల్‌ 1 నాటికి మిగిలిన నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 2010–11 ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.16,010.45 కోట్లు. ఏప్రిల్‌ 1, 2014 నాటికి రూ.5,135.87 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం రూ.2,868.40 కోట్లు పోనూ మిగిలిన రూ.8,006.18 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం పరోక్షంగా తేల్చిచెప్పింది.
► ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న పోలవరం అంచనా వ్యయాన్ని టీడీపీ సర్కార్‌ పెంచేసి పనులన్నీ సబ్‌ కాంట్రాక్టులపై అప్పగించి కమీషన్లు వసూలు చేసుకుంది.
► పోలవరానికి నాబార్డు నుంచి తొలి విడతగా రూ.1,982 కోట్ల రుణాన్ని తీసుకుని ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏల ద్వారా ఆ చెక్‌ను డిసెంబర్‌ 26, 2016న అప్పటి సీఎం చంద్రబాబుకు నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అందజేశారు. డిసెంబర్, 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేయకుంటే.. అప్పటిదాకా విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామని కేంద్రం విధించిన షరతుకు అంగీకరిస్తూ చంద్రబాబు సంతకం చేయడం గమనార్హం.
► కమీషన్‌ల కక్కుర్తితో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాల రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయం రూపంలోనే రూ.30,022.78 కోట్లు నష్టపోయింది. 2018లోగా ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల అప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన రూ.6,727.26 కోట్లను రుణంగా పరిగణించింది. వెరసి మొత్తమ్మీద ఖజానాపై రూ.36,750.04 కోట్ల భారం పడింది.
► పోలవరాన్ని చంద్రబాబు కమీషన్‌ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారంటే ప్రాజెక్టులో ఏ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయో గ్రహించవచ్చు. 

సీఎం జగన్‌ నిర్ణయాలతో మారిన కేంద్రం వైఖరి..
► ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నిపుణుల కమిటీతో పోలవరం పనులను ప్రక్షాళన చేయించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో దర్యాప్తు చేయించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను మిగిల్చారు. ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు వివరించారు. సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేసి ప్రాజెక్టును 2021 నాటికి పూర్తిచేసేలా సహకరించాలని కోరారు. 
► పోలవరం పనుల్లో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని కేంద్ర జలసంఘం సభ్యులు హెచ్‌కే హల్దార్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ , పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఆర్‌ఈసీ కూడా అదే రీతిలో నివేదిక ఇవ్వడంతో కేంద్రం వైఖరిలో మార్పు వచ్చింది.
‘పోలవరం’ సందర్శన సందర్భంగా ప్రాజెక్ట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌) 

ఇంకా రావాల్సింది రూ.29,521.70 కోట్లు...
► 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించి ఆర్‌ఈసీకి నివేదిక పంపింది. 
► సీడబ్ల్యూసీ నివేదికపై పలుమార్లు చర్చించిన ఆర్‌ఈసీ చంద్రబాబు అధికారంలో ఉండగా అర్థరాత్రి కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని బహిర్గతం చేస్తూ ఇక నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
► అయితే విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులను కేంద్రం విడుదల చేయాల్సిందేనని ఆర్‌ఈసీకి ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లతో సీఎం జగన్‌ చర్చించారు.
► ఈ క్రమంలో 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఈనెల 6న ఆర్‌ఈసీ నిర్ధారించి ఆమోదించింది. 
► నీటిపారుదల వ్యయం రూ.43,164.83 కోట్లు, 2014 ఏప్రిల్‌ 1 వరకు పనులకు చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు, ఇప్పటిదాకా కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులు రూ.8,507.26 కోట్లను మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రూ.29,521.70 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement