ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు | Sales targeting college youth | Sakshi
Sakshi News home page

ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు

Jun 28 2025 4:43 AM | Updated on Jun 28 2025 4:44 AM

Sales targeting college youth

కూటమి పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ విక్రయాలు 

కళాశాలల యువతే లక్ష్యంగా అమ్మకాలు 

శివారు ప్రాంతాలలో జోరుగా సాగుతున్న దందా 

ఏడాదిలోనే 300 కేజీల గంజాయి స్వాదీనం 

కట్టడిలో పూర్తిగా విఫలమైన కూటమి సర్కార్‌ 

కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్‌ దందా గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. యువత, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకునే బాలలే లక్ష్యంగా మాదక­ద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాలకులకు రెడ్‌బుక్‌ పేరిట రాజకీయ కక్షలు సాధించడంతో సరిపోతోంది. దీంతో  డ్రగ్స్‌ దెబ్బకు యవత బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది.

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకైన్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  

విద్యార్థులే లక్ష్యంగా... 
శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్‌ గమ్, పౌడర్‌ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్‌ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్‌ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి.  

రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ
మంగళగిరి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్‌ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్‌ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్‌ చేశారు. 

పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్‌ను మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement