
సాక్షి, రాజమహేంద్రవరం: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉపనదులైన ప్రాణ హిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరులో వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలోకి వరద పెరుగుతోంది.పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 31.050 మీటర్లకు నీటిమట్టం పెరిగింది.వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్‌వే గేట్ల నుంచి 3 లక్షల15 వేల791 క్యూసెక్కుల వరద నీటినిదిగువకు విడుదల చేశారు.
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గురువారం నాటికి ఇది వాయవ్య బంగాళాఖా తం, దాని సరిహద్దులో ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. ఈ ఫలితంగా గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి వర్షాల ఉద్ధృతి పెరగనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని తెలిపింది.