కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం

Revolutionary Change In Governance With The Secretariat System In Andhra Pradesh - Sakshi

ఉన్న ఊళ్లలోనే 94.05 లక్షల వినతుల పరిష్కారం

సచివాలయ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పు

ప్రజలకు సత్వర సేవలు.. కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసలు

గత ఆక్టోబర్‌ 2న ప్రారంభమైన సచివాలయాల వ్యవస్థకు ఏడాది పూర్తి

15,004 సచివాలయాలు, 1.34 లక్షల శాశ్వత కొత్త ఉద్యోగాల కల్పన

ఎంత పెద్ద పనైనా ఊరు దాటి వెళ్లకుండానే సకాలంలో పూర్తి

ఏ పథకానికైనా అర్హతే ప్రామాణికం.. సంతృప్త స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక

రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలకు సర్కారు సిద్ధం

సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనల్లోంచి పుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అనతి కాలంలోనే అద్భుతాలు సృష్టించింది. మారుమూల కుగ్రామంలో ఉన్నా, నగరంలో ఉన్నా.. ఒకే సమయంలో ప్రజలకు సత్వర సేవలు అందిస్తూ.. దేశానికే ఆదర్శం అయింది. ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగకుండా.. ఉన్న ఊళ్లోనే పనులు అవుతున్నాయి.

సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక గత ఏడాది అక్టోబర్‌ 2వ తేదీన రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి 543 రకాల ప్రభుత్వ సేవలు ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి సెప్టెంబర్‌ 28వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,00,69,911 వినతులు నమోదు కాగా, అందులో 94.05 లక్షల వినతులు పరిష్కారమయ్యాయి. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను కేంద్రం కూడా ప్రశంసించింది.  

పైరవీలకు తావే లేదు
► గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో రాష్ట్రంలో పైరవీల వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడినట్లయింది. గతంలో పేదింటి అవ్వకు పెన్షన్‌ కావాలన్నా.. నిరుపేద కుటుంబానికీ రేషన్‌ కార్డు కావాలన్నా.. ఓ రైతు తన పేరున పట్టాదారు పాస్‌ పుస్తకం తీసుకోవాలన్నా.. ఛోటా మోటా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా పని కాని పరిస్థితి. 

► ఇప్పుడు అర్హులై ఉంటే చాలు దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి గరిష్టంగా పది రోజుల్లో రేషన్‌కార్డు, పింఛన్లు మంజూరు అవుతున్నాయి.

► 4.41 లక్షల మంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే కేవలం పది రోజుల వ్యవధిలో 4.11 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. 16.36 లక్షల మంది రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత వ్యవధిలోనే 15.90 లక్షల మందికి మంజూరయ్యాయి. 52 వేల మందికి కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే మంజూరు చేశారు. 

స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోయినా..
► రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సర్పంచి, వార్డు కౌన్సిలర్‌ వంటి స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ లేరు. ఇలాంటి సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లే పెద్ద దిక్కయ్యారు. 
► గతంలో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో వంటి వారు నాలుగైదు ఊర్లకు కలిపి ఒకరుండే వారు. వీధి దీపాలు, మురుగు కాల్వలు, రోడ్లపై గుంతలు వంటి సమస్యలన్నీ వారే పరిష్కరించాల్సి వచ్చేసింది.  
► రాష్ట్రంలో 2018 ఆగస్టులోనే గ్రామ సర్పంచిల పదవీ కాలం ముగిసినా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించని కారణంగా ఇప్పటికీ గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులెవరూ లేరు. 
► కరోనా వంటి విపత్కర సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలైనా, ఇతర కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగడానికి గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు వలంటీర్ల వ్యవస్థే ప్రధాన కారణం.
► కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా 3 నెలల వ్యవధిలో ఆరు సార్లు ఇంటింటి సర్వే చేశారంటే అది ఈ వ్యవస్థ వల్లే అనేది స్పష్టం.  

4 లక్షల మందికి ఉద్యోగాలు..
► సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వం 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించింది. కేవలం 4 నెలల వ్యవధిలో భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ ఉద్యోగాల కోసం 19.50 లక్షల మందికి పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించింది. దేశ చరిత్రలో ఇదో అరుదైన రికార్డుగా రాజకీయ నిపుణులు పేర్కొన్నారు.
► ఖాళీగా ఉన్న 16,208 పోస్టులకు ఇటీవల నిర్వహించిన రాత పరీక్షలకు 10.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చిత్తశుద్ధిపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.
► ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల గ్రామ, వార్డు వలంటీర్లను కూడా కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లయింది. 

సచివాలయాల్లో మరిన్ని సౌకర్యాలు 
► సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందు కోసం మండలానికి ఇద్దరు చొప్పున 1,340 మంది శిక్షకులు, 1,340 ఆధార్‌ నమోదు కిట్లను అందుబాటులో ఉంచారు. 
► ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కాజా గ్రామ సచివాలయంలో ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించారు.  
► సచివాలయాల్లో బ్రాంచ్‌ పోస్టాఫీసుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. తొలి దశలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో 115 చోట్ల బ్రాంచ్‌ పోస్టాఫీసులు ఏర్పాటు చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top