
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు నిలిపేసిన చార్జీల రాయితీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని భారతీయ రైల్వే శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో తగిన అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది.
కాగా, ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు గతంలో ఇచ్చిన రాయితీని పునరుద్ధరించామని ఆర్టీసీ తరఫు న్యాయవాది పి.దుర్గాప్రసాద్ ధర్మాసనానికి నివేదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రైల్వే శాఖ కూడా ఈ దశలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో వృద్ధులకు గతంలో ఇస్తూ వచ్చిన రాయితీని కోవిడ్ సమయంలో రద్దు చేశారని, తర్వాత దాన్ని పునరుద్ధరించలేదని, ఈ విషయంలో అధికారులకు తగిన ఆదేశాలివ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది.